కోటా: రెండు రోజుల క్రితం నీట్ పరీక్ష రాసిన బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల విద్యార్థి రాజస్థాన్‌లోని కోటాలోని బహుళ అంతస్థుల భవనం పదో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో మహమ్మద్ నసీద్ అక్కడికక్కడే చనిపోయాడు. ఏడాదిగా నీట్ పరీక్ష కోసం కోటాలో శిక్షణ తీసుకొంటున్న నసీద్ రెండు రోజుల క్రితమే జైపూర్‌లోని సెంటర్‌లో నీట్ పరీక్ష రాసి ఆ మర్నాడే కోటాకు తిరిగి వచ్చాడు. నసీద్ తన స్నేహితులతో కలిసి ఈ బిల్డింగ్‌లో ఉంటున్నాడు. ఘటన జరిగినప్పుడు అతని రూమ్మేట్‌లు ఎవరూ అక్కడ లేరని విజ్ఞాన్ నగర్ పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దేవేశ్ భరద్వాజ్ చెప్పారు.
కాగా తాను మిగతా మిత్రులతో కలిసి బైటికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని రూమ్మేట్స్‌లో ఒకరైన సుజీత్ చెప్పాడు. నసీద్ కోపంగా గదిలోనుంచి బైటికి వచ్చి రెయిలింగ్స్‌పైనుంచి దూకినట్లు సిసిటీవీ కెమెరా దృశ్యాల్లో తాను చూసినట్లు అతను చెప్పాడు. బహుశా నీట్ పరీక్ష సరిగా రాయనందుకే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అతను చెప్పాడు. కాగా నసీద్ తల్లిదండ్రులు బెంగళూరునుంచి వచ్చాక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని భరద్వాజ్ చెప్పారు.