Monday, January 20, 2025

నీట్ యుజి పరీక్షను రద్దు చేయకుండా అడ్డుకోండి: సుప్రీంలో పిటిషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వివాదాస్పద నీట్ యుజి పరీక్షను రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ)కి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ నీట్ పరీక్షలో ఉన్తర్ణత సాధించడంతోపాటు ఫస్ట్ ర్యాంకు పొందిన గుజరాత్‌కు చెందిన 50 మందికి పైగా అభ్యర్థులు గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది మే 5న జరిగిన నీట్ యుజి పరీక్షలో పేపర్ లీకేజీ వంటి అక్రమాలకు పాల్పడిన విద్యార్థులు, ఇతరులపై దర్యాప్తు చేసి, దోషులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవలసిందిగా కేంద్ర విద్యా మంత్రిత్వశాఖను ఆదేశించాలని వారు సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీట్ యుజి పరీక్షను రద్దు చేయాలని, తిరిగి పరీక్ష నిర్వహించాలని కోరుతూ దాఖలైన 26 పిటిషన్లపై జులై 8న చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టడానికి కొది రోజుల ముందు గుజరాత్‌కు చెందిన 56 మంది అభ్యర్థులు ఈ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబిబిఎస్, బిడిఎస్, ఆయుష్ తదితర వైద్య కోర్సులలో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్(నీట్) యుజి పరీక్షను ఎన్‌టిఎ నిర్వహిస్తుంది. ఈ ఏడాది మే 5న 4,750 సెంటర్లలో నీట్ యుజి పరీక్ష నిర్వహించగా దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

ఈ పరీక్షకు సంబంధించి పేపర్ లీకేజీతో సహా అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో అనేక నగరాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రత్యర్థ రాజకీయ పక్షాల మధ్య వాగ్యుద్ధానికి ఇవి దారితీశాయి. కాగా..నీట్ పరీక్షను రద్దు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది దేవేంద్ర సింగ్ ద్వారా సిద్ధార్థ్ కోమల్ సింగ్లా, 55 మంది ఇతర అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News