Friday, January 3, 2025

వారంలో నీట్ నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -
NEET notification 2022
జూన్ చివరి వారంలో పరీక్ష..?
ఈసారి కూడా ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష

హైదరాబాద్ : దేశంలో వైద్యవిద్యలో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) -2022కు సంబంధించి వారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ఏడాది నీట్ పరీక్షను జూన్ చివరి వారంలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ఇప్పటికే జెఇఇ మెయిన్ నోటిఫికేషన్ విడుదల చేయగా, త్వరలోనే నీట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కూడా ఆఫ్‌లైన్ విధానంలోనే నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా నీట్ పరీక్ష నిర్వహణ ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవుతుంది.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది సకాలంలో నీట్ నిర్వహించాలని ఎన్‌టిఎ భావిస్తోంది. ఇప్పటికే పలు పోటీ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడగా, వారం లోగానే నీట్ నోటిఫికేషన్ విడుదల చేసేలా ఎన్‌టిఎ ఏర్పాట్లు చేస్తోంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. నీట్ పరీక్షలో గత ఏడాది 200 ప్రశ్నలు ఉండగా, 180 ప్రశ్నలకే సమాధానం ఇచ్చేలా ఛాయిస్ ఇచ్చారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కుల విధానం అమలు చేశారు. అయితే గత ఏడాది తరహాలోనే ప్రశ్నాపత్రంలో ఛాయిస్ ఉంటుందా..? లేదా..? అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో కూడా దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రత్యక్ష బోధన కొనసాగలేదు. కాబట్టి గత ఏడాది తరహాలోనే 200 ప్రశ్నలకు 180కి సమాధానాలు రాసేలా ఛాయిస్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంపై వచ్చే నెలలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

నీట్ పరీక్ష ద్వారా దేశంలోని 532 వైద్య కళాశాలల్లో 83,125 ఎంబిబిఎస్ సీట్లు, 313 దంత కళాశాలల్లో 26,949 బిడిఎస్ సీట్లు, 52,720 ఆయుష్ సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో 2022 -23 వైద్య విద్యా సంవత్సరంలో కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. వాటిల్లో 1,200 ఎంబిబిఎస్ సీట్లు వస్తాయి. మెడికల్ ప్రవేశాల్లో ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతాయి. ఈ కోటా కింద ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్లు లభిస్తాయి. ఎయిమ్స్, జిప్ మర్ వంటి ప్రతిష్టాత్మక మెడికల్ విద్యాసంస్థలతో పాటు దేశంలోని అగ్రశ్రేణి వైద్య కళాశాలల్లో ఎంబిబిఎస్,బిడిఎస్ వంటి యుజి మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు నీట్ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. నీట్ -2021 పరీక్షకు 15 లక్షల మందికి పైగా దేశవ్యాప్తంగా హాజరుకాగా, వీరిలో సుమారు 8 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అభ్యర్థి ర్యాంకు, కేటగిరీని బట్టి మెడికల్ కాలేజీల్లో సీటు దక్కుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News