హైదరాబాద్ : దేశంలోని వైద్య, దంత కళాశాలల్లో ఎండి, ఎంఎస్, ఇతర పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (నీట్ -పిజి) 2021 పరీక్షను సెప్టెంబర్ 11న నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మంగళవారం ట్వీట్ చేశారు. వాస్తవానికి గత ఏప్రిల్ 18న నీట్ (పిజి) పరీక్ష జరుగాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా పరీక్ష వాయిదా పడింది. దాంతో అప్పటి ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ నీట్ (పిజి) పరీక్ష నిర్వహణను వాయిదా వేశారు.
నీట్ యుజి దరఖాస్తులు ప్రారంభం
సెప్టెంబర్ 12న నీట్ యుజి ప్రవేశ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మంగళవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఆగస్టు 7వ తేదీ రాత్రి 11.30 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. పరీక్షకు మూడు రోజుల ముందు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు.