Wednesday, January 22, 2025

నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ జరగలేదు

- Advertisement -
- Advertisement -

నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) యుజి-2024లో విద్యార్థులు అక్రమాలకు పాల్పడినట్లు 63 కేసులు వెలుగులోకి రాగా వీరిలో 23 మందిని డిబార్ చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) అధికారులు బుధవారం వెల్లడించారు. అయితే వైద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్ పవిత్రతకు ఎక్కడా కళంకం రాలేదని, ప్రశ్నాపత్రం లీకేజ్ జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన మిగిలిన 40 మంది అభ్యర్థుల ఫలితాలను విత్‌హెల్డ్ చేశామని ఎన్‌టిఎ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ తెలిపారు. ఒక వ్యక్తికి బదులుగా వేరే వ్యక్తి పరీక్ష రాయడం, ఓఎంఆర్ షీట్‌లో మోసానికి, ట్యాంపరింగ్‌కి పాల్పడినట్లు వెలుగుచూసిన వివిధ రకాల కేసులను దర్యాప్తు చేసేందుకు పరీక్షల నిర్వహణ, విద్యా రంగంలో నిపుణులైన ముగ్గురు సభ్యులతో కమిటీ వేసినట్లు ఆయన చెప్పారు. కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా 12 మంది అభ్యర్థులు మూడేళ్ల పాటు పరీక్షకు హాజరుకాకుండా డిబార్ చేశామని, 9 మంది అభ్యర్థులను రెండేళ్ల పాటు డిబార్ చేశామని, ఇద్దరు అభ్యర్థులను ఒక ఏడాదికి డిబార్ చేశామని సుబోధ్ కుమార్ తెలిపారు.

మిగిలిన అభ్యర్థుల ఫలితాలను విత్‌హెల్డ్ చేశామని ఆయన చెప్పారు. ఒక్కో కేసుకు సంబంధించి కమిటీ విడివిడిగా సిఫార్సులను అందచేసిందని ఆయన వివరించారు. అక్రమ పద్ధతులకు పాల్పడినట్లు మొత్తం 63 కేసులు తమ దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా..కొన్ని కేంద్రాలలో పరీక్ష ప్రారంభం ఆలస్యం కావడంతో నష్టపోయిన సమయాన్ని భర్తీ చేసేందుకు 1,563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడంపై విద్యార్థులు, ప్రతిపక్షాల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో దీన్ని సమీక్షించేందుకు విద్యా శాఖ గత వారం ఒక నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. కమిటీ తన నివేదికను ఇంకా సమర్పించవలసి ఉంది. గ్రేస్ మార్కుల కారణంగా 67 మంది అభ్యర్థులు టాప్ ర్యాంకును సాధించినట్లు వచ్చిన ఆరోపణల గురించి ప్రశ్నించగా 720కి 720 మార్కులు సాధించిన 67 మంది అభ్యర్థులలో 44 మంది అభ్యర్థులు ఫిజిక్స్‌కు చెందిన ఆన్సర్ కీ రివిజన్ వల్ల ఆ మార్కులు పొందారని, ఆరుగురు అభ్యర్థులు మాత్రమే గ్రేస్ మార్కులు పొందారని ఆయన వివరించారు. గ్రేస్ మార్కులు పొందిన ఇద్దరు అభ్యర్థులకు 718, 719 మార్కులు వచ్చాయని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News