Tuesday, January 7, 2025

నీట్‌పిజి పరీక్ష ముందు నిర్ణయించినట్లు మార్చి5నే జరుగుతుంది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారి కోసం నిర్వహించే నీట్ పిజి పరీక్ష ముందు నిర్ణయించినట్లుగా మార్చి 5నే నిర్వహించడం జరుగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శుక్రవారం లోక్‌సభలో తెలియజేశారు. ఎవరు కూడా అవకాశం కోల్పోకుండా ఉండేలా చూడడం కోసం ఇంకా ఇంటర్న్‌షిప్ పూర్తి చేయని ఎంబిబిఎస్ విద్యార్థులందరికీ కటాఫ్ తేదీని పొడిగించినట్లు కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గగోయ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తిన గగోయ్ నీట్‌పిజి2023 పరీక్షను మరి కొద్ది నెలలు వాయిదా వేయాలన్న విద్యార్థుల డిమాండ్‌పై ప్రభుత్వం వైఖరి ఏమిటని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ ‘మార్చి 5న పరీక్ష నిర్వహించబడుతుంది.

ఈ విషయం అయిదు నెలల క్రితమే ప్రకటించడం జరిగింది. దీనికి హాజరుకావాలనుకొంటున్న విద్యార్థులు ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నారు’ అని చెప్పారు. ఇంతకు ముందు పరీక్షలు 8 నెలలు… ఆ తర్వాత నాలుగు నెలలు ఆలస్యమయ్యాయి.ఇలా ఆలస్యం చేసుకుంటూ పోతే ఇబ్బంది వస్తుంది. కచ్చితమైన తేదీని నిర్ణయించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులందరూ నీట్‌పిజి పరీక్షకు హాజరవడం కోసం తమ మంత్రిత్వ శాఖ కటాఫ్ తేదీని పొడిగించిందని ఆయన చెప్పారు. తమ ఇంటర్న్‌షిప్ పూర్తికావడంలో ఆలస్యం అయిన కారణంగాఎంట్రన్స్ పరీక్షను వాయిదా వేయాలని నీట్‌పిజి పరీక్ష రాయలని అనుకొంటున్న కొంతమంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తప్పనిసరి అయిన ఒక ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తి చేసేందుకు గడువును జూన్ 30నుంచి ఆగస్టు 11కు పొడిగించింది కూడా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News