పారదర్శకంగా, జవాబుదారీగా పనిచేయాలి
ఆరు గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేస్తాం
రాష్ట్ర ప్రజలకు ఎలాంటి అనుమానాలు అపోహలు వద్దు
కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీగా సేవలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనకు అనుగుణంగా అధికారుల పనితీరు ఉండాలే తప్పా విధుల్లో అలసత్వం వహిస్తే సహించమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఆదివారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ప్రభుత్వ ఉద్దేశాలపై దశా దిశా నిర్దేశం చేశారు. రాబోయే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజా పాలన అందించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో అధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగానే అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని చెప్పారు. రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించడం పట్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారని ఈ పథకం సక్సెస్ ఫుల్ గా అమలవుతోందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రతి పేదవాడికి కార్పొరేట్ లో మెరుగైన వైద్యం అందించాలని ప్రధానమైన సంకల్పంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ. 10 లక్షలకు పెంచామని దీని ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.
మిగత గ్యారెంటీలను కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తొలి వంద రోజుల్లోగా కచ్చితంగా అమలు చేస్తామని, ఇందులో ఎలాంటి మార్పులు లేవని, అనుమానాలకు కూడా తావు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే గ్యారంటీల హామీలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి లబ్ధిదారునికి అందించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరే విధంగా అధికారుల పాలన ఉండాలన్నారు. పాత ప్రభుత్వంలో పనిచేసిన పద్ధతిని కొంత మంది అధికారులు మార్చుకోవాలని ఆ మైండ్ సెట్ ఇకముందు ఉండకూడదన్నారు.