రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలులో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట నియోజకవర్గం, నంగునూరు మండలం, పాలమాకుల గ్రామంలో శుక్రవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వడ్ల కొనుగోలు తీరుపై ఆయన ఆరా తీశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట వంటి జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు దళారులకు అమ్ముకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాల్‌కు రూ.2,320 మద్దతు ధర రావాల్సి ఉండగా గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు దళారులకు రూ.2 వేలకు మాత్రమే అమ్ముకుంటున్నారని తెలిపారు. గతేడాది వానాకాలంలో మొత్తం లక్షా 53 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పి కేవలం 52 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం సేకరించగలిగిందని గుర్తుచేశారు. అంటే మూడొంతుల్లో ఒక వంతు మాత్రమే కొనుగోలు చేయగలిగిందని పేర్కొన్నారు.
ఈ యాసంగి పంటకు కూడా ప్రభుత్వంలో అదే నిర్లక్ష్యం కనబడుతోందని అనుమానం వ్యక్తం చేశారు. రుణమాఫీ విషయంలో కూడా సగం మందికే చేశారని ఎద్దేవా చేశారు. రైతు బంధు సైతం వానాకాలం పూర్తిగా ఎగ్గొట్టి యాసంగిలో రెండు మూడు ఎకరాల వరకే ఇచ్చారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 0 వేల ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే ఆయ జిల్లాల కలెక్టర్ల ద్వారా నివేదిక తెప్పించుకొని రైతులను ఆదుకోవాలని కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొన్న 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని హైదరాబాద్‌లో గొప్పలు చెప్పుకుంటున్నారని కానీ నంగునూరు మండలంలో ధాన్యం అమ్మిన రైతులకు వారం రోజులైనా డబ్బులు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. నాసిరకం గన్నీ బ్యాగులతో హమాలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. అటు అకాల వర్షాలు, ఇటు రైతుబంధు, మరోపక్క మద్దతు ధర రాక ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని వెంటనే ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన వెంట మాజీ ఎంపిపి జాప శ్రీకాంత్ రెడ్డి, ఎఎంసి మాజీ ఛైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, పిఎసిఎస్ ఛైర్మన్లు కోల రమేష్ గౌడ్, ఎల్లంకి మహిపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, ఐకెపి సిబ్బంది ఉన్నారు.