Thursday, January 23, 2025

నెహ్రూ, అంబేద్కర్ ఢిల్లీకి రాష్ట్ర హోదా వ్యతిరేకించారు: అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రతిపక్ష పార్టీలు తమ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సూచించారు. కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై జరుగుతోన్న చర్చల్లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ, అంబేద్కర్ వంటి నేతలు ఢిల్లీకి రాష్ట్ర హోదాను వ్యతిరేకించారన్నారు. “ మీ కూటమిలో ఉన్నారన్న ఒక్క కారణం చేత, ఢిల్లీలో జరుగుతోన్న అవినీతికి మద్దతు పలకొద్దని అన్ని పార్టీలను కోరుతున్నాను. ఎందుకంటే ఈ కూటమి ఉన్నప్పటికీ , ప్రధాని మోడీ రాబోయే ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ కొత్తగా ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ఇండియాలో భాగంగా ఉంది. ఈ క్రమం లోనే అమిత్‌షా ఈ సూచన చేయడం గమనార్హం. అలాగే ఆప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “ 2015 లో ఢిల్లీలో ఆ పార్టీ (ఆప్ ) అధికారం లోకి వచ్చింది. వారి ప్రధాన ఉద్దేశం ఘర్షణ పడటమే. ఇక్కడ బదిలీల అంశం సమస్య కాదు. వారి బంగ్లాల నిర్మాణం వంటి వాటిల్లో జరుగుతోన్న అవినీతి దాచేందుకు విజిలెన్స్ విభాగాన్ని నియంత్రిస్తుండటమే అసలు సమస్య. 2015 ముందు వరకు వివిధ ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఢిల్లీ లోని పరిపాలన వ్యవహారాలు సజావుగా సాగాయి. ” అని ఆప్‌పై విమర్శలు గుప్పించారు.

జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సి. రాజగోపాల చారి, రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేద్కర్ వంటి నేతలు కూడా ఢిల్లీకి పూర్తి స్థాయి హోదా ఇవ్వాలన్న ఆలోచనను వ్యతిరేకించారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఢిల్లీలో ప్రభుత్వాధికారులపై ఎవరి నియంత్రణ ఉండాలన్న విషయంపై గత కొన్నేళ్లుగా కేంద్రం, ఆప్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నన్యాయపోరాటంపై ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

ఈ తీర్పు అనంతరం పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్సును తీసుకొచ్చింది దాని స్థానంలో బిల్లును కేంద్రం ఈ వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. ‘ ఢిల్లీకి సంబంధించి ఏ అంశంపైన అయినా పార్లమెంట్‌కు చట్టం చేసే అధికారం ఉందని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆ ఆర్డినెన్స్ వెల్లడిస్తోంది. ఢిల్లీకి సంబంధించి చట్టాలను రూపొందించేందుకు రాజ్యాంగం లోని నిబంధనలు అనుమతిస్తున్నాయి ” అని అమిత్‌షా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News