Monday, December 23, 2024

నెహ్రూను చెరిపేయగలరా?

- Advertisement -
- Advertisement -

ఆనవాళ్ళను ధ్వంసం చేస్తే చరిత్ర చెరిగిపోతుందా, పోదు. రాజకీయం అన్ని ఆలోచనలను, వాటి ప్రతినిధులను గౌరవిస్తూ సాగడమే ప్రజాస్వామ్యం. ఎందుకంటే ప్రజలలో సకల భావజాలాల వారూ వుంటారు. అంతేకాదు గతాన్ని సజీవంగా వుంచే చారిత్రక సంపదను కాపాడడమే వర్తమాన పాలకుల మంచితనాన్ని చాటుతుంది. బిజెపి పాలకులకు ఈ మర్యాద బొత్తిగా లేదని పదేపదే చెప్పుకోవలసి వస్తున్నది. భారత దేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ నెహ్రూ గనుక లేకపోయి వుంటే తన సాటి, తన కంటే మేటి అనిపించుకోగలవారు వుండే వారు కాదు కదా అనే వేదన ప్రధాని నరేంద్ర మోడీలో రోజురోజుకీ పేరుకుపోతూ నిద్ర పట్టనీయడం లేదని అనుకోవాలా? లేక నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆధునిక, శాస్త్రీయ ఆలోచనలు ఆయనకు బొత్తిగా గిట్టకనా? దేశాన్ని వెనక్కి, ఇక్షాకుల కాలంలోకి తీసుకు పోవాలన్న తమ సిద్ధాంతానికి నెహ్రూ చల్లిన శాస్త్రీయ భావజాల విత్తనాలు వృక్షాలై అడ్డొస్తున్నాయన్న ఉక్రోషమా?

ప్రధాని మోడీ దేశాధికారాన్ని చేపట్టిన తర్వాత గత తొమ్మిదేళ్ళలో నెహ్రూ ఫోటోను, ఆయన ప్రస్తావనను కనపడనీయకుండా చేసిన నిర్వాకం తెలిసిందే. అది చాలదని ఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ సముదాయంలో గల నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ పేరును ప్రధాన మంత్రుల మ్యూజియం, లైబ్రరీ సొసైటీగా మార్చాలని మోడీ ప్రభుత్వం శుక్రవారం నాడు తీసుకొన్న నిర్ణయం అనాగరకంగా వుంది. నెహ్రూ చనిపోయిన తర్వాత 1964లో ఆయన పేరిట ఈ భవన నిర్మాణానికి సంకల్పించారు. స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన చరిత్రను భద్రపరచడానికి దీనిని ఆవిష్కరించారు. ఆధునిక, సమకాలీన చరిత్రకు సంబంధించిన పరిశోధనను పెంపొందించాలని ఉద్దేశించారు. మహాత్మా గాంధీ రచనలను ఇందులో పొందుపరిచారు. మాజీ ప్రధాని నెహ్రూకు సంబంధించిన చరిత్ర తెలుసుకోడానికి ఈ భవనం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉపయోగపడుతున్నది.

సి రాజగోపాలా చారి, జయప్రకాశ్ నారాయణ్, రాజ్‌కుమారి అమృత్ కౌర్ వంటి వారి విశేష పత్రాలు ఇక్కడ పొందుపరిచారు. తీన్ మూర్తి భవన్ జవహర్ లాల్ నెహ్రూ నివాస భవనం. అందువల్లనైనా దానిని ఆయన పేరుతో కొనసాగనిచ్చి వుండాల్సింది. కావలిస్తే మరొక చోట ప్రధానులందరి గొప్పతనాన్ని చాటే మరో భవనాన్ని నిర్మించి వుండవలసింది. ప్రపంచ చరిత్రలో ఎంతో మంది పాలకులు తమ ఇష్టావిలాసంగా చరిత్రను వక్రీకరించాలని ప్రయత్నించారు.కాని వారి వికృత చేష్టలే చరిత్రలో మిగిలిపోయాయి, అసలు చరిత్రకు ఎటువంటి హాని కలగలేదు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లు బుద్ధుడి చరిత్ర ఆనవాళ్ళను ధ్వంసం చేశారు. అందువల్ల తథాగతుని చరిత్రకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. గతాన్ని చెరిపేయాలని సాంస్కృతిక విప్లవానికి పిలుపిచ్చిన మావో కూడా అపఖ్యాతి పాలయ్యారు. కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను ఆవిష్కరిస్తానని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోడీ ఇప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితిని రాజకీయాల్లో ఎదుర్కొంటున్నారో కళ్ళముందు కనిపిస్తున్నదే. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచినట్టు మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ విజయం సాధిస్తుందని అనుకొంటే పొరపాటే. అయితే దానిని నిశ్శేషం చేయాలనుకోడం మాత్రం జరిగే పని కాదు.

జరగబోయే దానిని ముందే ప్రకటించడం దుస్సాహసమే. నెహ్రూ కొన్ని విషయాల్లో కొందరికి నచ్చకపోవచ్చు. అంతమాత్రాన ఆయన చేసిన మంచి లేదని అనడానికి వీల్లేదు. బాగా చదువుకొన్నవాడు, దేశ చరిత్రనే కాదు, ప్రపంచ చరిత్రను కూడా లోతుగా అధ్యయనం చేసినవాడు, వాటి మీద రెండు గొప్ప గ్రంథాలు రచించిన వాడు. ఇతరత్రా అనేక రచనలకు ప్రపంచ ప్రశంసలు అందుకొన్నవాడు. రాజకీయంగా చూస్తే ఇతర ప్రపంచ నేతలతో కలిసి ఆయన నిర్మించిన అలీనోద్యమం ఎంతో గొప్పది. ప్రపంచం ఘర్షణలతో అట్టుడికినట్టు ఉడికిపోతున్న సమయంలో దానిని చల్లార్చే దిశగా అలీనోద్యమం చాలా ఉపయోగపడింది. అంతర్జాతీయ స్థాయి సంబంధాలు వున్న వాడు కాబట్టే నెహ్రూ ప్రధాని కాగలిగాడు. అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య మెసిలాడని ఆయనను గుర్తుంచుకొనేందుకు వెలిసిన ఒక మంచి చిహ్నాన్ని గౌరవించాలనే సద్బుద్ధి కమలనాథులకు లేకపోడాన్ని అర్థం చేసుకోవచ్చు.

నెహ్రూ పురోగామి దృక్పథం కలవాడైతే, బిజెపి పాలకులు గతంలో బతుకుతూ వుంటారు. ప్లాస్టిక్ సర్జరీ అనాడే వుందని, మొట్టమొదట విమానాన్ని మనమే తయారు చేశామని, పుష్పక విమానమే అందుకు తార్కాణమని భావించేవారి హయాంలో శాస్త్రీయ చైతన్యం ఎలా వర్ధిల్లుతుంది? అటువంటి చైతన్యాన్ని పెంచి పోషించి తన జాతి ఆధునిక పథంలో పయనించాలని కోరుకొన్న నెహ్రూ మీద ఇంత పచ్చిగా పగ ప్రదర్శించడం బిజెపి భవిష్యత్తుకే మంచిది కాదు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ ఇప్పటికైనా గమనించి తన దూకుడును తగ్గించుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News