Friday, December 20, 2024

నియోపోలీస్ లే ఔట్ పనులు చివరి దశకు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న హెచ్‌ఎండిఏ సంస్థ కోకాపేట నియోపోలీస్ లే ఔట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. అందులో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐటీ కారిడార్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కోకాపేట నియోపోలీస్ లే ఔట్‌ను సిద్ధం చేస్తోంది. తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు ఇతర ప్రాజెక్టులకు ఈ లే ఔట్ రోల్ మోడల్‌గా నిలుస్తుందని హెచ్‌ఎండిఏ తెలిపింది. ఈ లేట్ వల్ల అటు ఐటీ కంపెనీలు, ఇటు నివాస భవనాలను నిర్మించుకునేందుకు వీలుగా పూర్తి స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తూ హెచ్‌ఎండిఏ అభివృద్ధి పనులను చేపట్టింది. ఏడాదిన్నర కిత్రం చేపట్టిన లే ఔట్ అభివృద్ధి పనులు దాదాపు పూర్తయ్యాయి. 239, 240 సర్వే నెంబర్‌లలోని సుమారు 530 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌ఎండిఏ చేపట్టిన ఈ లే ఔట్ ఐటీ కారిడార్‌లోనే ఆధునిక మౌలిక వసతులకు నిలయంగా మారనుంది. ఇప్పటికే ఒక విడత ప్లాట్లను విక్రయించిన హెచ్‌ఎండిఏ, మరో విడతలో మిగిలిన ప్లాట్లను విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

మొదటివిడత ఆన్‌లైన్ వేలానికి భారీగా స్పందన
ఐటీ కారిడార్‌లోని కోకాపేటలో ప్రభుత్వ భూముల అమ్మకానికి సంబంధించి 2021 జూలైలో మొదటివిడతగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన వేలానికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన కోకాపేట నియోపోలిస్ లే ఔట్‌లో ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్ వేలంలో మొత్తం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను విక్రయానికి ఉంచగా వీటిని కొనడానికి 60 మంది బిడ్డర్లు పోటీపడ్డారు. ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించగా, బిడ్డర్లు పోటీ పడి మరీ స్థలాలను దక్కించుకోవడం విశేషం.

మొదటివిడత వేలం ద్వారా రూ.2000 వేల కోట్లు
2021 సంవత్సరంలో నియోపోలీస్ లే ఔట్‌లో మొదట విడతగా నిర్వహించిన వేలానికి ఎకరానికి కనిష్టంగా రూ.31.2 కోట్ల ధర పలకగా, గరిష్ట ధర రూ.60.2 కోట్లు పలికింది. రాజపుష్ప ప్రాపర్టీ సంస్థ ఎకరానికి రూ.60.20 కోట్ల చొప్పున 1.65 ఎకరాలను రూ.99.33 కోట్లకు సొంతం చేసుకోగా, మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా హెచ్‌ఎండిఏకు రూ.2000.37 కోట్ల ఆదాయం సమకూరింది.

58 అంతస్తుల వరకు వ్యాపార, వాణిజ్య, నివాస భవనాలు
కోకాపేటలో ఇప్పటికే 58 అంతస్తుల వరకు వ్యాపార, వాణిజ్య, నివాస భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా హెచ్‌ఎండిఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్ లే ఔట్‌లోనూ అదే స్థాయిలో హై రైజ్ అపార్ట్‌మెంట్‌లను నిర్మించడానికి అవకాశం ఉండటంతో బిడ్డర్లు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డును అనుకొని ఉండటంతో పాటు పక్కనే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఉండటంతో ఈ భూములకు ప్రాధాన్యం పెరిగింది.

36 మీటర్లు, 45 మీటర్ల వెడల్పు రోడ్లు…
గతంలో వచ్చిన స్పందనకు అనుగుణంగా హెచ్‌ఎండిఏ ఈ టౌన్‌షిప్ కోసం ఫ్యూచరిస్టిక్, అడ్వాన్స్‌డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 36 మీటర్లు, 45 మీటర్ల వెడల్పు రోడ్లు, 45 మీటర్ల వెడల్పుతో ఎనిమిది లేన్‌ల క్యారేజ్‌వే అంతర్గత రోడ్లను, దీంతోపాటు 36 మీటర్ల వెడల్పుతో ఆరు-లేన్ క్యారేజ్‌వే రోడ్లను హెచ్‌ఎండిఏ నిర్మించింది. టౌన్‌షిప్‌లో కేబుల్స్ కోసం యుటిలిటీ డక్ట్‌లు, పూర్తిగా అభివృద్ధి చెందిన మురికినీటి కాలువల నెట్‌వర్క్, సైకిల్ ట్రాక్‌లు, పాదాచారుల కోసం నడక మార్గాలు, స్ట్రీట్ లైట్ వెలుతురుతో కూడిన ట్రీ జోన్‌ల రూపంలో అంతర్గత రోడ్ నెట్‌వర్క్‌లను హెచ్‌ఎండిఏ నిర్మాణం చేసింది.

ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం అయ్యేలా….
ఇప్పటివరకు హెచ్‌ఎండిఏ అభివృద్ధి చేసిన లే ఔట్ల కంటే భిన్నంగా కోకాపేట నియోపోలీస్ లే ఔట్‌ను విశాలమైన రోడ్లతో డిజైన్‌ను చేశారు. 150 అడుగుల నుంచి మొదలుకొని 1,20,100 అడుగుల వెడల్పుతో కూడిన రోడ్లను నిర్మిస్తూ, వాటి చుట్టూ ప్రత్యేకంగా నిర్మించారు. దీనివల్ల భవిష్యత్‌లో కేబుల్స్ కోసం ప్రత్యేక తవ్వకాలు చేపట్టకుండా బ్రాక్స్‌డెయిన్ ద్వారా ఎలాంటి కేబుల్స్ అయినా తీసుకెళ్లేలా లే ఔట్‌లో నిర్మాణం చేపట్టారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోడ్డుకు ఇరువైపులా ప్రత్యేకంగా స్థలాన్ని అందుబాటులో ఉంచారు. సుమారు 5 ఎకరాల స్థలాన్ని సబ్‌స్టేషన్ కోసం స్థలాన్ని ముందుస్తుగా కేటాయించారు. దీంతోపాటు ఓఆర్‌ఆర్, శంకర్‌పల్లి లాంటి ప్రధాన రహదారులతో ఈ లేట్‌కు అనుసంధానం అయ్యేలా హెచ్‌ఎండిఏ ఏర్పాట్లు చేసింది.

ప్రధాన రహదారులను కలుపుతూ లింక్‌రోడ్లు
హెచ్‌ఎండిఏ అభివృద్ధి చేస్తున్న నియోపోలీస్ లే ఔట్‌కు ఒకవైపు ఔటర్ రింగ్‌రోడ్డు, మరోవైపు మెహిదీపట్నం, -శంకర్‌పల్లి వెళ్లే ప్రధాన రహదారులు ఉండగా వీటిని కలుపుతూ లింకు రోడ్లను నిర్మిస్తున్నారు. లే ఔట్‌లో ప్రతిపాదించిన రోడ్ల నిర్మాణం పూర్తి కావడంతో ఇక లింకు రోడ్లను పూర్తి చేసే పనిలో హెచ్‌ఎండిఏ అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఓఆర్‌ఆర్ మీదుగా వచ్చే వాహనాలు నియోపోలీస్ లే ఔట్‌లోకి వచ్చేందుకు వీలుగా ట్రంపెట్‌ను నిర్మించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News