ప్రతిపక్ష రాష్ట్రాలకు నిధులు నిలిపివేస్తున్నారు
రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల ఆరోపణ
న్యూఢిల్లీ : జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి)ని రాష్ట్రాలపై ప్రభుత్వం బలవంతంగా రుద్దుతున్నదని, వాటి స్వయంప్రతిపత్తిని దెబ్బ తీస్తున్నదని మంగళవారం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. విద్యా మంత్రిత్వశాఖ పని తీరుపై చర్చలో రితబ్రత బెనర్జీ (టిఎంసి), కనిమోళి, ఎన్‌విఎన్ సోము (డిఎంకె) పాల్గొంటూ, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడులో విద్యా కార్యక్రమాలకు ఉద్దేశించిన నిధులను కేంద్రం నిలిపివేస్తున్నదని ఆరోపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వాలను ఏమాత్రం సంప్రదించకుండా ఎన్‌ఇపిని రాష్ట్రాలపై రుద్దారు’ అని బెనర్జీ విమర్శించారు. అంతర్ విభాగ, బహుళ విభాగ వ్యవస్థతో నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేషన్ కోర్సును పశ్చిమ బెంగాల్ నిలిపివేయవలసి వచ్చిందని ఆయన తెలిపారు.
ఎన్‌ఇపి 2020పై ప్రభుత్వాన్ని బెనర్జీ తూర్పారపడుతూ, సునిశిత ఆలోచన, వైజ్ఞానిక దృక్పథం, రాజ్యాంగ విలువలను ప్రోత్సహించడం గురించి ప్రభుత్వం మాట్లాడుతుంటుందని, కానీ డార్విన్ పరిణామ సిద్ధాంతం, పైథాగరస్ సిద్ధాంతం వంటి సైన్స్‌కు ప్రాథమికమైన అంశాలకు స్వస్తి పలికిందని ఆక్షేపించారు. ‘దేశవ్యాప్తంగా వేలాది మంది శాస్త్రవేత్తలు నిరసించినప్పటికీ వాటిని తొలగించారు’ అని ఆయన విమర్శించారు. ఎన్‌సిఇఆర్‌టి కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. యుపి ప్రభుత్వం సిలబస్‌ను సవరంచిందని, ఆ సవరణలో రవీంద్రనాథ్ ఠాగూర్‌ను సిలబస్‌లో నుంచి మినహాయించిందని కూడా బెనర్జీ తెలిపారు. ‘ఎన్నికైన ప్రభుత్వానికి ఆ పని చేసే హక్కు ఉంది. అది వారి విచక్షణాధికారం. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థానంలో రామ్‌దేవ్‌ను తీసుకురావచ్చునని వారు బహుశా భావించి ఉంటారు’ అని బెనర్జీ అన్నారు.
కనిమోళి, సోము చర్చలో పాల్గొంటూ, భారత్‌లో విఖ్యాత విద్యా శాఖ మంత్రులు ఎందరో ఉన్నారని, కానీ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యా మంత్రిత్వశాఖ సవాళ్లను, ముఖ్యంగా ‘నిర్హేతుక విధాన నిర్ణయాలను’ ఎదుర్కొన్నదని వ్యాఖ్యానించారు. ‘ఆయన సారథ్యంలో రాష్ట్ర స్వయంప్రతిపత్తిని ఉల్లంఘిస్తున్నారు, నిర్ధారిత ఫెడరల్ సూత్రాల నుంచి మళ్లుతున్నారు, అభివృద్ధి, సమ్మిళిత పాలన వ్యవస్థను చిన్నచూపు చూస్తున్నారు’ అని వారు ఆరోపించారు. 201416 దరిమిలా ‘కేంద్రీకరణ, పాఠ్యాంశాల మార్పులు’ జరుగుతున్నాయని, 201619 దరిమిలా ‘రాష్ట్ర ప్రతిపత్తిని కించపరుస్తూ’ నీట్‌ను అమలు పరుస్తున్నారని సోము ఆరోపించారు. సంజయ్ సింగ్ (ఆప్) చర్చలో పాల్గొంటూ, దేశంలో పాఠశాలల్లో మధ్యలో చదువులు మానివేస్తున్నవారి సంఖ్య అధికంగా ఉంటుండడం ఆందోళనకరమని అన్నారు. వైసిపి ఎంపి జి బాబూరావు, ఆర్‌జెడి ఎంపి మనోజ్ కుమార్ ఝా కూడా చర్చలో పాల్గొన్నారు.