హరారే: వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌లో నేపాల్ తొలి విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్ ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 49 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన నేపాల్ 43 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
ఓపెనర్ ఆసిఫ్ షేక్ (12) ఆరంభంలోనే పెవిలియన్ చేరినా మరో ఓపెనర్ కుశాల్ భుర్టెల్‌తో కలిసి వన్‌డౌన్‌లో వచ్చిన భీమ్ షక్రి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కుశాల్ 4 ఫోర్లు, సిక్సర్‌తో 39 పరుగులు చేశాడు. మరోవైపు సమన్వయంతో బ్యాటింగ్ చేసిన భీమ్ షక్రి ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (16), కుశాల్ మల్లా (13) విఫలమయ్యారు.
అయితే దీపేంద్ర సింగ్ 39 (నాటౌట్)తో కలిసి భీమ్ నేపాల్‌ను గెలిపించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో నేపాల్ బౌలర్లు సఫలమయ్యారు. అయితే వికెట్ కీపర్ షయాన్ జాంగీర్ విధ్వంసక శతకంతో అమెరికాను ఆదుకున్నాడు. చెలరేగి ఆడిన జాంగీర్ 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఓపెనర్ సుశాంత్ ముదాని (42), గజానంద్ (26) మాత్రమే రాణించారు. నేపాల్ బౌలర్లలో కరన్ కెసి నాలుగు, గుల్షన్ ఝా మూడు, దీపేంద్ర సింగ్ రెండు వికెట్లు తీశారు.