నేపాల్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి రెండు బస్సులు నదిలో కొట్టుకుపోగా ఏడుగురు భారతీయులతో సహా 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. చిట్వాన్ జిల్లాలోని నారాయణ్‌ఘాట్-ముగ్లింగ్ రహదారిలోని సిమల్టల్ వద్ద 65 మంది ప్రయాణికులతో వెళుతున్న రెండు బస్సులపై కొండ చరియలు విరిగిపడ్డాయని, ఆ పక్కనే ప్రవహిస్తున్న త్రిశూలి నదిలో బస్సులు పడిపోగా వాటిలోని ప్రయాణికులు నదిలో గల్లంతయ్యారని చిట్వాన్ జిల్లా ప్రధాన అధికారి ఇంద్రదేవ్ యాదవ్ తెలిపారు. ఖట్మాండుకు వెళుతున్న యాంజిల్ బస్సు, ఖట్మాండు నుంచి గౌర్ వెళుతున్న గణపతి డీలక్స్ బస్సు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైనట్లు ఆయన చెప్పారు.
ఖట్మాండు వెళుతున్న బస్సులో 24 మంది, గౌర్ వెళుతున్న బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు యాదవ్ చెప్పారు. గణపతి డీలక్స్ బస్సులోని ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడినట్లు ఖట్మాండు పోస్టు పత్రిక తెలిపింది. బీర్‌గంజ్ నుంచి ఖట్మాండు వెళుతున్న యాంజిల్ బస్సులో ప్రయాణిస్తున్న 21 మంది వివరాలను అధికారులు వెల్లడించారు. గల్లంతైన ఏడుగురు భారతీయులను సంతోష్ ఠాకూర్, సురేంద్ర షా, ఆదిత్ మియాన్, సునీల్, షానవాజ్ ఆలం, లన్సారీగా గుర్తించారు. మరో ప్రయాణికుడి వివరాలు లభించలేదని అధికారులు చెప్పారు. కాగా..త్రిశూలీ నదిలో రెండు బస్సులు కొట్టుకుపోయిన దుర్ఘటనపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ తీవ్ర విచారం ప్రకటించారు. గల్లంతైన ప్రయాణికుల కోసం గాలింపు, సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.