ఖాట్మండ్ : నేపాల్‌లో అతిపెద్ద ప్రతిపక్ష కమ్యూనిస్టు పార్టీ సిపిఎన్ యుఎంఎల్ లో అధికారికంగా చీలిక వచ్చింది. ఒక చీలిక వర్గానికి అసమ్మతి నేత మాధవ్ కుమార్ నేపాల్ నాయకత్వం వహించారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం రిజిస్టర్ చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయ పార్టీలు సులువుగా చీలిపోయేందుకు వీలు కల్పించేలా ప్రభుత్వం వివాదాస్పదమైన ఆర్డినెన్సుకు మద్దతు ఇవ్వడంతో ఈ పరిణామం తలెత్తింది.
సిపిఎన్ యుఎంఎల్ (సోషలిస్టు ) అన్న పేరుతో కొత్త పార్టీ ఏర్పాటుకు మాధవ్ కుమార్ నేపాల్ ఎన్నికల కమిషన్‌కు బుధవారం ధరఖాస్తు చేశారు. అంతకు ముందు బుధవారం మంత్రి మండలి సిఫార్సుపై అధ్యక్షురాలు బిడ్యా దేవీ భండారీ రాజకీయ పార్టీల చట్టం 2071 సవరణపై ఆర్డినెన్సు జారీ చేశారు. రాజకీయ పార్టీలు విడిపోడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండడానికే ఈ ఆర్డినెన్సు. పార్లమెంటరీ పార్టీ లోని 20 శాతం లేదా ఎక్కువ మంది సభ్యులు కానీ, సెంట్రల్ కమిటీ కానీ తమ స్వంత పార్టీ నుంచి విడిపోవచ్చు. ఈ ఆర్డినెన్సు మాధవ్‌కుమార్ నేపాల్ ఝలనాధ్ ఖనాల్ వర్గానికి ప్రస్తుతం ఎంతో సహాయ పడవచ్చు. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఈ చీలిక వర్గం కీలక పాత్ర వహించే అవకాశం ఉంది.