ఓటింగ్‌ను బహిష్కరించిన ప్రతిపక్షం
ఖాట్మండూ : నేపాల్ పార్లమెంట్‌లో సోమవారం జరిగిన బలపరీక్షలో ప్రధాన మంత్రి పుష్ఫ కమల్ దహల్ ‘ప్రచండ’ నెగ్గారు. దీనితో ఆయన దేశంలోని తమ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగేందుకు వీలేర్పడింది. ఈ హిమాలయ దేశంలో 18 నెలల్లో ఆయన విశ్వాసపరీక్షకు దిగడం ఇది నాలుగోసారి. తరచూ చెలరేగుతున్న రాజకీయ సంక్షోభాల నడుమ రాజకీయ సుస్థిరతను నిలబెట్టేందుకు ప్రచండ యత్నించాల్సి వస్తోంది. 275 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 69 సంవత్సరాల ప్రచండకు చెందిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్)కు 157 ఓట్లు దక్కాయి. సభలో ప్రభుత్వ బలనిరూపణకు కనీసం 138 ఓట్లు అవసరం, ఈ బలాన్ని ప్రచండ చాటుకున్నారు.
దీనితో ఆయన ప్రస్తుత అధికారానికి తిరుగులేకుండా ఉంది. మాజీ గెరిల్లా అయిన ప్రచండ పార్టీ సభలో మూడో అతి పెద్ద పార్టీగా ఉంది. ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం సాగుతోంది. సోమవారం నాటి బలపరీక్షకు ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ హాజరుకాలేదు. మొత్తం 158 మంది ఎంపిలు తమ ఓటు హక్కు వాడుకున్నారు. ఓటింగ్‌కు ముందు సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ప్రధాని, హోం మంత్రి అయిన రబి లమిఛానే దేశంలోని సహకార సంఘాల నిధులను కాజేసినట్లు , దర్యాప్తు చేపట్టాలని కోరుతూ విపక్షాలు నినాదాలకు దిగాయి. దీనితో బలపరీక్ష నిర్వహణలో జాప్యం ఏర్పడింది. తరువాతి క్రమంలో ఓటింగ్ జరిపిన స్పీకర్ దేవ్ రాజ్ ఘిమిరే ఫలితం ప్రకటించారు. సభలో సంకీర్ణ ప్రభుత్వం నెగ్గిందని వెల్లడించారు.