రద్దయిన పార్లమెంటును మరోసారి పునరుద్ధరిస్తూ నేపాల్ సుప్రీంకోర్టు అక్కడి రాజకీయ సంక్షోభంలో ఇంకో అధ్యాయానికి తెర లేపింది. గత మే నెలలో ప్రధాని కెపి శర్మ ఓలి మంత్రి వర్గం సిఫారసుపై దేశాధ్యక్షురాలు విద్య భండారీ రద్దు చేసిన పార్లమెంటుకు ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సోమవారం నాడు మళ్లీ ప్రాణం పోసింది. అంతటితో ఆగకుండా పార్లమెంటు రద్దును సవాలు చేసిన పిటిషనర్లలో ఒకరైన ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ నేత షేర్ బహదూర్ దేవ్‌బాను ప్రధానిని చేయాలని దేశాధ్యక్షురాలిని ఆదేశించింది. 275 మంది సభ్యులు గల నేపాల్ పార్లమెంటులో తనకు 149 మంది మద్దతు ఉందంటూ ప్రభుత్వం ఏర్పాటు అవకాశాన్ని షేర్ బహదూర్ దేవ్‌బా డిమాండ్ చేసి ఉన్నారు. దేవ్‌బా ఇంతకు ముందు నాలుగు సార్లు ప్రధానిగా చేశారు. పార్లమెంటును పునరుద్ధరించాలని ప్రతిపక్ష పార్టీల కూటమి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దేవ్ బాను ప్రధానిని చేయాలని అందులో కోరింది. దానిపై 146 మంది పార్లమెంటు సభ్యులు సంతకం చేశారు. అవే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయనకు కలిసి వచ్చాయి.
దేవ్‌బా ను ప్రధానిని చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు వచ్చే మంగళవారం సాయంత్రంలోగా పార్లమెంటును సమావేశ పరచాలని చెప్పింది. కొత్త ప్రధాని పట్ల విశ్వాస ప్రకటన ఓటింగ్‌లో పార్టీల విప్‌లు పని చేయరాదని ఆదేశించింది. ఆ విధంగా నేపాల్‌లో పదవీ కాలం ముగిసే వరకు ప్రస్తుత పార్లమెంటు కొనసాగేలా ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. ప్రభుత్వం ఏర్పాటుకు గల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా పార్లమెంటు రద్దు చేయడాన్ని న్యాయస్థానం తప్పుపడుతున్నది. అయితే దేవ్‌బా పగ్గాలు చేపట్టిన తర్వాత మెజారిటీ నిరూపించుకోలేకపోతే ఏమి చేస్తారనేది కీలక ప్రశ్న. అప్పుడైనా పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు వెళ్లవలసి ఉంటుంది కదా! సుప్రీంకోర్టే సభ్యులను నియమించి కొత్త పార్లమెంటును సృష్టించజాలదు. అది ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధం అవుతుంది. 2018 ఎన్నికల్లో నేపాల్ కమ్యూనిస్టు పార్టీలు రెండూ కలిసి పోటీ చేసి విజయాన్ని సాధించాయి. అప్పుడు ఆ రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం చెరి సగ కాలం ప్రధాని పదవిని అనుభవించవలసి ఉంది. కాని ప్రధాని కెపి శర్మ ఓలి ఆ అంగీకారాన్ని ఉల్లంఘించి తానే కొనసాగుతూ వచ్చారు.
ఇది రెండవ వర్గానికి నాయకుడైన ప్రచండ (పుష్ప కమల్ దహాల్) కు అసంతృప్తిని, ఆగ్రహాన్ని కలిగించింది. ఆ వర్గం శర్మ ఓలికి మద్దతును ఉపసంహరించుకుంది. పర్యవసానంగా ఓలి మైనారిటీ ప్రభుత్వాధినేత అయ్యాడు. పార్లమెంటు రద్దు మార్గాన్ని ఎంచుకొని అధికారంలో కొనసాగుతున్నాడు. ఇందుకు ఆయనకు దేశాధ్యక్షురాలి మద్దతు లభిస్తున్నది. ఈ పరిస్థితిని ఇతర రాజకీయ పక్షాలు, దేశ ప్రజలు హర్షించడం లేదు. ప్రధాని సొంత పార్టీలో ఒక వర్గం కూడా ఆయనకు ఎదురు తిరిగిందంటే ఆయన పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.తన నిర్ణయాన్ని రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదని ప్రెసిడెంట్ భండారీ గతంలోనే వాదించారు. పాలక సిపిఎన్ యుఎంఎల్ నాయకుడు ప్రదీప్ గ్యావాలి సుప్రీంకోర్టు తాజా నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఇది దేశంలో ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుందని అన్నారు.
రాజ్యాంగం కార్యనిర్వాహక, న్యాయ, పార్లమెంటరీ వ్యవస్థలు మూడింటికీ సమాన స్థాయిని కల్పించిందని, సుప్రీంకోర్టు ప్రధానిని నియమించడం ద్వారా పార్లమెంటు హక్కును, అధికారాన్ని హరించిందని, ఇది దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ఈ అభిప్రాయం ఎంత మాత్రం తప్పు పట్టవలసింది కాదు. అయితే ప్రధాని భండారీ రాజకీయంగా వీగిపోయి తన ప్రభుత్వం మైనారిటీకి దిగజారిన తర్వాత కూడా అధికారాన్ని పట్టుకొని వేళ్లాడడానికి దేశాధ్యక్షురాలి మద్దతును దుర్వినియోగం చేశారనే అభిప్రాయం ప్రజల్లో కలిగిన తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయానికి తిరుగులేని పరిస్థితి ఏర్పడింది. నేపాల్ రాజకీయ నాయకత్వం మరింత విజ్ఞతతో వ్యవహరించి బంతి సుప్రీంకోర్టులోకి వెళ్లకుండా తమలో తామే సమస్యను పరిష్కరించుకొని ఉంటే బాగుండేది. అది జరగలేదు. నేపాల్ చిరకాలం రాచరిక పాలనలో ఉండి ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్నది. 2008 మే లో మొదటి రాజ్యాంగ సభ రాచరికాన్ని రద్దు చేసి నేపాల్‌ను ఫెడరల్ డెమొక్రటిక్ రిపబ్లిక్‌గా ప్రకటించింది.
అయితే ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోయే దక్షత తమకు కొరవడిందని నేపాల్ రాజకీయ పక్షాలు చాటుకుంటున్నాయి. ఇది ఎంత వరకు దారి తీస్తుందో చూడాలి. ఒకప్పుడు భారత దేశానికి సన్నిహితంగా ఉండిన నేపాల్‌లో ఈ మధ్య చైనా జోక్యం పెరిగింది. దాని దన్నుతో ప్రధాని శర్మ ఓలి భారత దేశానికి వ్యతిరేకంగా మారాడు. అందుచేత అక్కడి తాజా పరిణామాల మీద మన ప్రభుత్వం ఎటువంటి వ్యాఖ్య చేయకుండా జాగ్రత్త వహించడం హర్షించదగిన అంశం.