న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరించారు. వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతి వంటి రుగ్మతల వల్ల భారతీయ ప్రజాస్వామ్యం దెబ్బతింటోందని, ఈ వాసత్వ పార్టీలను ఓడించి వచ్చే ఏడాది మళ్లీ ఎర్రకోటపై నుంచి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేస్తానని ప్రధాని మోడీ ప్రకటించారు.
ఇండియా కూటమి పేరిట చేతులు కలిపిన ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా తాను సాగించనున్న రాజకీయ ప్రచారం సారాంశాన్ని మోడీ పరోక్షంగా తెలియచేశారు. దేశానికి ముప్పుగా పరిణమించిన అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, బంధుప్రీతి అనే మూడు దుష్టశక్తులకు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కుటుంబం కోసం, కుటంబమే నడిపే పార్టీగా ఆయన వారసత్వ రాజకీయాలు సాగిస్తున్న పార్టీలను అభివర్ణించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడడమే తన జీవితాంత లక్షమని ఆయన చెప్పారు.
10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను ఏరివేసి అక్రమ ఆస్తుల స్వాధీనాన్ని 20 రెట్లు తమ ప్రభుత్వం పెంచిందని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రానున్న ఐదేళ్లలో అనూహ్యమై అభివృద్ధిని సాధిస్తుందని, 2047 నాటిక దేశం అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో సమిష్టిగా పాటుపడతామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
దేశం ఇప్పుడు భద్రతాపరంగా సురక్షితమన్న భావన ప్రజలలో ఏర్పడిందని, వరుస బాంబు పేలుళ్లు ఒకప్పటి వార్తలని మోడీ అన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో హింసాకాండ తగ్గుముఖం పట్టిందని ఆయన అన్నారు. రానున్న 25 ఏళ్లలో తీసుకునే నిర్ణయాలు తదుపరి శతాబ్దంపైన కూడా ప్రభావం చూపగలవని ఆయన పేర్కొన్నారు.