కోల్‌కతా: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీసుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధమవుతోంది. ఈ తరుణంలో నేతాజీ కుమార్తె అనితా బోస్(80) స్పందించారు. ఈ నెల 23న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి. ఈ సందర్భంగా కోల్‌కతాలోని షహీద్ మినార్ మైదానంలో జరిగే సభలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగంచనున్నారు.
అయితే ఈ పరిణామంపై అనితా బోస్ ఓ జాతీయ మీడియాసంస్థతో మాట్లాడారు. తన తండ్రి పేరును ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు పాక్షికంగా వాడుకోవాలని చూస్తున్నాయేమో అని అన్నారామె. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం, జాతీయ వాద నాయకుడైన తన తండ్రి లౌకిక వాదం, సమగ్రత ఆలోచనలు పరస్పర విజాతి ధ్రువాలని, అవి ఏ నాడూ కలవవని ఆమె అన్నారు. సిద్ధాంతాల విషయానికి వస్తే దేశంలోని ఇతర పార్టీలకంటే కాంగ్రెస్ పార్టీకి, నేతాజీకి ఎక్కువ సారూప్యతలు ఉన్నాయన్నారు.
అన్నిటికన్నా మించి తన తండ్రి లెఫ్టిస్టు అనే విషయాన్నిఆమె గుర్తు చేశారు. ‘ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు ఆయన వైఖరిని ప్రతిబింబించలేవు. వాళ్లు అతివాదులు, నేతాజీది వామపక్ష భావజాలం’ అని జర్మనీనుంచి పిటిఐతో ఫోన్‌లో మాట్లాడుతూ అనిత అన్నారు. నేతాజీ ఆర్‌ఎస్‌ఎస్ విమర్శకుడా? అన్న ప్రశ్నకు ఆ విషయం తనకు తెలియదన్నారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్ గురించి, నేతాజీ భావజాలం గురించి తనకు స్పష్టత ఉందని, ఈ రెండూ పొసగని అంశాలని అన్నారు. ముఖ్యంగా నేతాజీ సెక్యులరిజం అనేది ఆర్‌ఎస్‌ఎస్‌కు సరిపోని అంశమని ఆమె స్పష్టం చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల తరుణంలో నేతాజీ 125 జయంతి వేడుకల కోసం బిజెపి, తృణమూల్ కాంగ్రెస్‌లు పోటాపోటీ పడిన విషయం తెలిసిందే.