ఏడు నెలలుగా సాగుతున్న యుద్ధంలో లక్షలాది మంది పాలస్తీనా నిరాశ్రయులు తలదాచుకున్న దక్షిణాది గాజా నగరం రఫాను ఆక్రమించుకుంటామని ఇజ్రాయెలీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ప్రకటించారు. ఒప్పందం కుదిరినా కుదరకున్నా హమాస్ సేనలను నాశనం చేయడానికి రఫా నగరంలోకి ఇజ్రాయెల్ ప్రవేశిస్తుందని నెతన్యాహు హెచ్చరించారు. బందీల విడుదల కోసం ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న తరుణంలో నెతన్యాహు ఈ హెచ్చరికలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాము యుద్ధం ఆపితే తన లక్ష్యాలను సాధించుకోవాలన్నది హమాస్ ఆలోచనని, దాము ఇందుకు ఒప్పుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష చేశారు. తాము రఫాలోకి చొరబడి హాస్ సేనలను అంతం చేస్తామని ఆయన చెప్పారు.
ఈ యుద్ధంలో సంపూర్ణ విజయం తమదే అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. గాజాలోని తీవ్రవాదుల వద్ద బందీలుగా మారిన వారి కుటుంబ సభ్యులతో నెతన్యాహు మంగళవారం సమావేశమయ్యారు. హమాస్‌కు చివరి కంచుకోటగా మిగిలిన రఫా నగరంపై దాడి చేసి హమాస్ సేనలను అంతం చేయాలని ప్రభుత్వంలో తనపై ఒత్తిడి పెరుగుతోందని ఆయన చెప్పారు. గాజాకు చెందిన మొత్తం 23 లక్షల జనాభాలో దాదాపు సగం మంది రఫా నగరంలోనే తలదాచుకున్నారు. కాగా, రఫాను ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న పక్షంలో అక్కడ ఉన్న పౌరుల పరిస్థితి ఏమిటని అమెరికాతోసహా ఇతర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బందీల విడుదలకు బదులుగా యుద్ధాన్ని నిలిపివేయాలన్న ప్రతిపాదనను నెతన్యాహు వ్యతిరేకిస్తున్నారు. హమాస్ తీవ్రవాదుల అంతానికి రఫాపై దాడి కీలకమని ఆయన ప్రకటించారు.