Monday, December 23, 2024

నెదర్లాండ్స్ సూపర్ విక్టరీ ..

- Advertisement -
- Advertisement -

హరారే: ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌లో వెస్టిండీస్‌కు మరో షాక్ తగిలింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ సూపర్ ఓవర్‌లో విండీస్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్‌లో ఫలితాన్ని తేల్చారు. ఇందులో నెదర్లాండ్స్ అద్భుత విజయం సాధించింది. వాన్ బీక్ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగడంతో సూపర్ ఓవర్‌లో నెదర్లాండ్స్ 30 పరుగులు సాధించింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన వాన్ మూడు ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 30 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 8 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. వాన్ బిక్ అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్ల ఆరు వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది.

తర్వాత లక్షఛేదనకు దిగిన నెదర్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 374 పరుగులు సాధించింది. దీంతో మ్యాచ్ టైగా ముగియక తప్పలేదు. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ను తేజా నిడమనురు విధ్వంసక సెంచరీతో ఆదుకున్నాడు. తేజాది ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడా కావడం విశేషం. విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న తేజ 76 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. అతనికి కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్ అండగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఎడ్వర్డ్ 67 పరుగులు చేశాడు. ఇదిలావుండగా తేజతో కలిసి ఎడ్వర్డ్ ఐదో వికెట్‌కు 138 పరుగులు జోడించాడు. అయితే సెంచరీ హీరో తేజ కీలక సమయంలో ఔట్ కావడంతో నెదర్లాండ్స్ టైతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇక అంతకుముంతు తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌ను నికోలస్ పూరన్ అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన పూరన్ 65 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, 9 ఫోర్లతో అజేయంగా 104 పరుగులు చేశాడు. ఇక ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (76), చార్లెస్ (54)లు అర్ధ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ షాయ్ హోప్ (47), కిమో పాల్ 46 (నాటౌట్) కూడా ధాటిగా ఆడడంతో విండీస్ స్కోరు 374 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News