Sunday, January 19, 2025

మోడీ ‘దిగిపో’

- Advertisement -
- Advertisement -

ఇంటా.. బయటా.. దేశం పరువు తీసిన మోడీ
ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్రమోదీపై నెటిజన్ల ఆగ్రహం
రికార్డుస్థాయిలో 8గంటలపాటు మొదటిస్థానంలో ట్వీట్
అదానీ, అంబానీల కోసం దేశ సంపదను దోస్తున్న మోదీ
చైనా సరిహద్దు వివాదం పరిష్కారంలో విఫలం

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గద్దె దిగిపోయాలని, తప్పనిసరిగా రాజీనామా చేయాలని బుధవారం ట్విట్టర్‌లో నెటిజన్లు హోరెత్తించారు. “దేశం కోసం..ధర్మం కోసం..బిజేపీ” అనే నినాదం ఒకప్పుడు ఉండేదని, కానీ నేడు అదానీ, అంబానీల కోసమే బి.జె.పి.అన్నట్లుగా నరేంద్ర మోడీ దేశాన్ని పాలిస్తున్నాడని నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ ఇద్దరు గుజరాతీ వ్యాపారవేత్తల కోసం నరేంద్రమోడీ దేశాన్నే అమ్మేస్తున్నాడని, ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ ప్రైవేట్‌పరం చేస్తూ ప్రభుత్వాన్ని ఒక కార్పోరేట్ కంపెనీ మాదిరిగా మార్చేస్తున్నాడని, అందుకే “మోడీ మస్ట్ రిజైన్‌” అనే నినాదంతో నెటిజన్లు ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున డిమాండ్ల వర్షం కురిపించారు. మధ్యాహ్నం సుమారు మూడు గంటలకు ట్విట్టర్‌లో “మోడీ మస్ట్ రిజైన్‌” అనే ట్యాగ్‌తో ప్రారంభమైన ట్రెండింగ్ రాత్రి 9 గంటల తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్ర సమతికి చెందిన ప్రజాప్రతినిధులు, అనేక మంది ఇతర నెటిజన్లు భారీ సంఖ్యలో ట్వీట్‌లు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు సైతం వీరికి తోడవ్వడంతో ట్విట్టర్ ట్రెండింగ్‌లో మోడీ రాజీనామా అంశం అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మోడీ రాజీనామా డిమాండ్ జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యింది. ప్రభుత్వ పాలనా చేతకాదు, ప్రపంచ దేశాలతో సఖ్యతగా ఉండటం చేతకాదు, ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయడం చేతకాదు, ఆర్ధిక పరిపుష్టితో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడం, వాటిని అంబానీ, అదానీలకు దారాదత్తం చేయడమే మోడీకి తెలుసునని నెటిజన్లు భారీ ఎత్తున మండిపడ్డారు. శ్రీలంక దేశంలో 500 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును అదాని గ్రూపుకు అప్పగించాలని ఆ దేశాధినేత రాజపక్సేపై వత్తిడి చేసినట్లుగా నరేంద్రమోడీ అవినీతి బాగోతాన్ని శ్రీలంక ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తన పదవికి రాజీనామా చేసి మరీ ఈ కుట్రను బహిర్గతం చేశారని, దీంతో భారతదేశ ప్రతిష్ట మంటగలిసిందని నెటిజన్లు ఆగ్రహం వక్తంచేశారు. అంతేగాక శ్రీలంక పవర్ ప్రాజెక్టు విలువ 5000కోట్ల రూపాయలని, ఇది బోఫోర్స్ కుంభకోణం కంటే కూడా చాలా పెద్దది అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.

దీనికితోడు బి.జె.పి. నాయకురాలు నుపుర్‌శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో భారత దేశానికి అనాదిగా అండగా ఉంటూ అనేక అంశాల్లో సంపూర్ణంగా మద్దతు పలుకుతూ వచ్చిన అనేక ముస్లీం దేశాలు సైతం భారతదేశానికి వ్యతిరేకంగా ధ్వజమెత్తే పరిస్థితులకు దిగజార్చిన ఘనతను కూడా నరేంద్ర మోడీ మూటగట్టుకొన్నాడని నెటిజన్లు మండిపడ్డారు. పొరుగున ఉన్న చైనాతో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో కూడా నరేంద్రమోదీ ఘోరంగా వైఫల్యం చెందారని, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశీ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, అందుకే చైనాతోపాటుగా గల్ప్ దేశాలు కూడా మునుపెన్నడూ లేనంతగా బి.జె.పి. ప్రభుత్వంపై మండిపడుతున్నాయని, ఇవన్నీ దేశానికి శుభం కాదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అంతేగాక అంతర్జాతీయ టెర్రరిజాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ ఎంత బ్రతిమలాడినా భారతదేశానికి వ్యతిరేకంగా గల్ఫ్‌దేశాలు పాక్‌కు మద్దతు ఇవ్వలేదని, ఇంకా చెప్పాలంటే పాకిస్థాన్‌ను వ్యతిరేకించాయని కూడా అలాంటి ముస్లీం దేశాలు కూడా నరేంద్ర మోడీ చేతగాని తనంవల్ల ఇండియాకు వ్యతిరేకంగా ప్రకటనలు జారీ చేశాయని నెటిజన్లు అగ్రహం వ్యక్తంచేశారు.

అంతేగాక దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుతూ, వాటిని బలోపేతం చేయాల్సిన గురుతర బాధ్యత ఉన్న కేంద్ర ప్రభుత్వంగా మోడీ వ్యవహరించడం లేదని, కొద్దిపాటి ఇబ్బందుల్లో ఉన్న పి.ఎస్.యు.లను ప్రైవేట్‌పరం చేయడం, వాటిని అంబానీ, అదానీలకు దారాదత్తం చేయడమే పనిగా పెట్టుకొన్నాడని, అంతేగాక ఎల్.ఐ.సి.వంటి లాభాల్లో ఉండి ఆర్ధిక పరిపుష్టితో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తున్న నరేంద్రమోడీ ఇక ఎంత మాత్రం ఆ పదవిలో కొనసాగడానికి వీల్లేదని, అందుకే మోడీ తప్పకుండా రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. వీటితో పాటుగా బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేయడమే కాకుండా వందలు, వేల కోట్ల రూపాయల రుణాల ఎగవేతదారులకు అండగా ఉంటూ, విజయ్‌మాల్యా, నీరవ్‌మోడీ వంటి వారు విదేశాలకు పారిపోవడానికి సహకరించింది రకూడా మోడీయేనని, నల్లధనం తెచ్చి ఇంటికి పది లక్షలు రూపాయలు ఇస్తానని బీరాలు పలికిన నరేంద్రమోడీయే అతిపెద్ద అవినీతి పరుడని శ్రీలంక ప్రభుత్వంపై వత్తిడి తెచ్చిన ఘటన రుజువు చేసిందని నెటిజన్లు మండిపడ్డారు.

వీటికి ప్రజలు పైసాపైసా కూడబెట్టి ఎల్.ఐ.సి వంటి ఇన్సూరెన్స్ కంపెనీల్లో డిపాజిట్లు చేసుకొంటే ఆ సొమ్ము రిజర్న్‌ల్లో కూడా 50 కోతలు విధించే విధంగా ఇన్సూరెన్స్ పాలసీలను సర్వనాశనం చేసిన ఘనత కూడా నరేంద్ర మోడీదేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. సెస్‌ల పేరుతో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ వంటి ఆయిల్ ఉత్పత్తులపై ధరలను రెట్టింపు చేసిన ఘనత కూడా నరేంద్రమోడీకే దక్కిందని మండిపడ్డారు. నిత్యావసర వస్తువులు చుక్కలను తాకాయని, వాటిని నియంత్రించేందుకు ఏ మాత్రం ప్రయత్నం చేయని నరేంద్రమోడీ ఇక ప్రధానమంత్రి పదవిలో కూర్చునే అర్హతను కోల్పోయాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా అన్ని విధాలుగా వైఫల్యాల మూటగట్టుకొన్న వ్యక్తి నరేంద్ర మోడీ అని నెటిజన్లు మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న ఎన్.డి.ఎ.ప్రభుత్వం కాదని, ఎన్.పి.ఎ (నాన్ పెర్‌ఫార్మింగ్ అలయెన్స్) ప్రభుత్వమని మాజీ మంత్రి, టి.ఆర్.ఎస్.పార్టీ సీనియర్‌నేత జోగు రామన్న సైతం ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తంచేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News