సీరం ఇనిస్టిట్యూట్ ప్రతినిధి పూనావాల వివరణ
న్యూఢిల్లీ : దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి టీకాలు ఎగుమతి చేయలేదని కొవిషీల్డ్ టీకా ఉత్పత్తి సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలా స్పష్టం చేశారు. భారత దేశంలో వ్యాక్సినేషన్‌పై సీరం సంస్థ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో ఈ వ్యాక్సిన్‌ను ఎగుమతి చేయడానికి గల కారణాలను ఈ ప్రకటనలో వివరించారు. ఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను దేశ ప్రజల ప్రాణాలను ప్రయోజనాలను పణంగా పెట్టి ఎగుమతి చేయడం లేదని పేర్కొన్నారు. గత ఏడాది కరోనా మహమ్మారి ప్రారంభ దశలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా గతంలో ఈ వ్యాక్సిన్‌ను విదేశాలకు పంపినట్టు తెలిపారు. ప్రపంచం లోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ ఒకటని, వ్యాక్సినేషన్‌లో అనేక సవాళ్లు ఉన్నాయని, అందువల్ల జనాభా అంతటికీ రెండు మూడు నెలల్లో టీకా కార్యక్రమం పూర్తికాబోదని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు రెండు నుంచి మూడేళ్లు పడుతుందన్నారు.
అమెరికా ఫార్మా కంపెనీల కంటే రెండు నెలలు ఆలస్యంగా తమకు ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ( అత్యవసర వినియోగం) అనుమతులు వచ్చినప్పటికీ తమ సంస్థ సీరం 200 మిలియన్ ( 20 కోట్ల ) డోసుల వ్యాక్సిన్‌ను అందచేసిందని తెలిపారు. ఉత్పత్తి చేసిన డోసులు, బట్వాడా చేసిన డోసులను పరిశీలిస్తే సీరం సంస్థ ప్రపంచంలో మూడు అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు. ఈ ఏడాది చివరకు మాత్రమే విదేశాలకు టీకాలు సరఫరా చేస్తామన్నారు. కరోనాపై సమష్టిగా పోరాటం సాగించాల్సి ఉందన్నారు. ఈ మహమ్మారి భౌగోళిక లేదా రాజకీయ సరిహద్దులకు పరిమితం కాదనే విషయాన్ని గ్రహించాలని కోరారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఓడించే వరకు మనకు రక్షణ లేదన్నారు.