హైదరాబాద్ : కొందరు పనిగట్టుకుని తాను ముదిరాజ్‌లకు వ్యతిరేకం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎంఎల్‌సి పాడి కౌశిక్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈటెల రాజేందర్ సొంత ఊర్లో తాను ముదిరాజ్‌లకు ఎక్కువ మేలు చేశానా? ఈటెల మేలు చేశారో తేల్చుకోవడానికి తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్ తనపై అనేక అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మీడియా అంటే తనకు ప్రత్యేక గౌరవమని స్పష్టం చేశారు. కానీ ఇద్దరు ముగ్గురు ఈటెల రాజేందర్ మీడియా బ్రోకర్లు తన పైన, సిఎం కెసిఆర్‌పైనా, మంత్రి హరీష్ రావు పైనా కట్టు కథలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని యూట్యూబ్ చానళ్ళు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కెమెరామెన్‌ను తాను బంధించానని, కులం పేరుతో దూషించానని తప్పుడు ప్రచారం చేశారని, కానీ ఆ కెమరామెన్ తమ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లారని చెప్పారు.
ఇది సిసిటివి ఫుటేజ్‌లో కూడా ఉందని అన్నారు.తాను ఏ ఒక్కరిని కులం పేరుతో దూషించలేదని పేర్కొన్నారు.ముదిరాజ్ బిడ్డను తిట్టినట్టు ఎవరైనా నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా అని పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. పేద మీడియా ప్రతినిధులను ఆదుకున్న ఘనత తనదే తప్ప ఈటెలది కాదని చెప్పారు. ప్రభుత్వ విప్,ఎంఎల్‌సి పాడి కౌశిక్‌రెడ్డి శుక్రవారం బిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈటెల రాజేందర్‌కు ఎంత సేపు సానుభూతి రాజకీయమే కావాలని విమర్శించారు. తాను ఏ కార్యక్రమం మొదలు పెట్టినా పెద్దమ్మ దేవతను తలుచుకునే చేస్తా అని, హుజారాబాద్ నియోజకవర్గంలోని ఏ ముదిరాజ్‌ను అడిగినా తన గురించి గొప్పగా చెబుతారని పేర్కొన్నారు.
గెలిచిన తర్వాత హుజురాబాద్‌లో తట్టెడు మన్నైనా తీశారా?
స్థానిక ఎంఎల్‌ఎగా ఈటెల రాజేందర్ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో ఎందుకు పాల్గొనలేదు..? కౌశిక్‌రెడ్డి నిలదీశారు. హుజురాబాద్‌లో నియోజక వర్గాన్ని బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఈటెల చేసిన ఆరోపణలు ఖండించారు. హుజురాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిని గణాంకాలతో సహా వివరిస్తానని తెలిపారు. 18 వేలకు పైగా దళిత కుటుంబాలకు 18 వందల కోట్ల రూపాయలతో దళిత బంధు పథకాన్ని అమలు చేశామని, దళిత బంధు అమలు కావడం లేదని ఈటెల సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎంఎల్‌ఎగా గెలిచిన తర్వాత ఈటెల హుజురాబాద్‌లో తట్టెడు మన్నైనా తీశారా..? అని ప్రశ్నించారు. ఆయన కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారని అన్నారు. మంత్రిగా ఈటెల హుజురాబాద్‌కు ఏమి చేయలేదని పేర్కొన్నారు. మంత్రిగా గంగుల కమలాకర్ కరీంనగర్‌కు ఎంతో చేస్తున్నారు ..మానేరు రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేశారని చెప్పారు. గంగులతో పోల్చుకుంటే మంత్రిగా ఈటెల హుజురాబాద్‌లో ఏమి చేయలేదని ఆరోపించారు. జమ్మికుంట నాయిని చెరువు సుందరీకరణకు కూడా ఈటెల ప్రయత్నించలేదని అన్నారు.
ఈటెల రాజేందర్ బిసి దొరలా వ్యవహరిస్తున్నారు
ఈటెల రాజేందర్ బిసి దొరలా వ్యవహరిస్తున్నారని పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. హుజురాబాద్ అభివృద్ధిపై ఈటెలతో బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. హుజురాబాద్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర చర్చకు సిద్ధమా..? అని కౌశిక్‌రెడ్డి ఈటలను అడిగారు. ఈటెల స్థాయి కన్నా తన స్థాయి ఎక్కువే అని, స్థాయి తక్కువ అని చర్చ నుంచి పారిపోవద్దని అన్నారు. హుజురాబాద్‌లో బిఆర్‌ఎస్ గెలుస్తుందని ప్రతి సర్వే చెబుతోందని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్‌ను ఎందుకు వీడానా…? అని ఈటెల ప్రతి రోజూ మధన పడుతున్నారని ఆరోపించారు. ఈటెల కాంగ్రెస్‌లోకి వెళ్తారో,బిఆర్‌ఎస్‌లోకి వస్తారో తెలియదని చెప్పారు. ఈటెల చేసిన అరాచకంలో తనది పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదని తెలిపారు. అసహనంతో ఈటెల సైకోగా మారారని విమర్శించారు. ఈ సారి ఈటెలకు డిపాజిట్ కూడా దక్కదని, వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్‌లో ఈటెల ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు. ఈటెల కన్నా సీనియర్ ఉద్యమకారుడు తన తండ్రి సాయినాథ్ రెడ్డే అని పేర్కొన్నారు. హుజురాబాద్‌లోని తమ ఇంట్లో టిఆర్‌ఎస్ జెండా పుట్టిందని, ఈటెల పెట్టిన ఇబ్బందుల వల్లే తన తండ్రి అపుడు టిఆర్‌ఎస్‌కు దూరమయ్యారని గుర్తు చేశారు. ఈటెల పార్టీని వీడగానే తాము సొంత గూటికి వచ్చామని పాడి కౌశిక్‌రెడ్డి వివరించారు.