Wednesday, January 22, 2025

చత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు..

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా టిఎస్ సింగ్ దేవ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించిన తరువాత రాష్ట్ర మంత్రి టి.ఎస్. సింగ్‌దేవ్ మాట్లాడుతూ తానెప్పుడూ రొటేషన్ ముఖ్యమంత్రి పదవి ఒప్పందం గురించి మాట్లాడలేదని , ఇదంతా కేవలం మీడియా సృష్టించిన సంచలనమే తప్ప మరేమీకాదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి గురువారం ఉదయం రాయ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన పార్టీ అధిష్ఠానం తనకు ఉన్నత గౌరవం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అసలు ఏమీ లేకుండా ఉండడం కన్నా ఆలస్యం మేలని వ్యాఖ్యానించారు. చత్తీస్‌గఢ్ డిప్యూటీ సిఎంగా సింగ్‌దేవ్ ప్రతిపాదనను బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అంగీకరించారని కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది. కొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.

ఈ బాధ్యత ఒకరోజు వరకు ఇచ్చినా అత్యంత కీలకమే అని సింగ్ దేవ్ పేర్కొన్నారు. గురువారం విమానాశ్రయంలో ఆయనకు మద్దతుదారులు ఘనమైన స్వాగతం ఇచ్చారు. ‘టిఎస్ బాబా జిందాబాద్ ’ అని నినాదాలు చేశారు. ఆయనకు ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కి మధ్య రెండున్నరేళ్ల అధికార పంపిణీ ఒప్పందం గురించి అడగ్గా దీనిగురించి తానెప్పుడూ ప్రస్తావించలేదని, ఇదంతా మీడియా సృష్టించిందేనని వ్యాఖ్యానించారు. ఏదేమైనా మీడియా నుంచి తనకు ఎప్పుడూ అనుకూలమైన మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బఘేల్‌కు , సింగ్‌దేవ్‌కు గత కొన్నాళ్లుగా సాగుతున్న అంతర్గత పోరును అరికట్టేందుకు, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం డిప్యూటీ సిఎం పదవిని సింగ్ దేవ్‌కు కల్పించింది. ఈ నియామకాన్ని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రశంసించారు. విపక్షం బీజేపీ నుంచి గట్టి సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఇది మరింత సమైక్యతకు వీలవుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News