Wednesday, January 22, 2025

డాక్టర్లను బెదిరించలేదు : మమత బెనర్జీ

- Advertisement -
- Advertisement -

వైద్యవిద్యార్థిని హత్యాచారంపై గత 21 రోజులుగా విధుల్ని బహిష్కరించి ఆందోళన సాగిస్తున్న జూనియర్ డాక్టర్లపై తాను ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లను తాను బెదిరించినట్టు కొన్ని వర్గాల నుంచి ఆరోపణలు వస్తున్నాయని, అవి పూర్తిగా అవాస్తవమని బెనర్జీ పేర్కొన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో వివరణ ఇచ్చారు. “ మెడికోలు, జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళనలకు వ్యతిరేకంగా తానొక్క మాటా అనలేదు. నేను వారికి పూర్తిగా మద్దతు ఇస్తున్నా. వారిని బెదిరించలేదు. కొంతమంది నాపై ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ అవాస్తవం” అని ఆమె వివరించారు.

తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ (విద్యార్థి విభాగం) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ ప్రసంగించారు. జూనియర్ డాక్టర్లు తమ ఆందోళన విరమించి వెంటనే విధుల్లోకి హాజరు కావాలని కోరారు. సమ్మె చేస్తున్న డాక్టర్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం తనకు ఇష్టం లేదని సూచించారు. అయితే ఈ వ్యాఖ్యలను పరోక్ష బెదిరింపుగా డాక్టర్లు భావించి విధుల్లోకి చేరడానికి తిరస్కరించారు. బెనర్జీ ఇంకా “ బీజేపీకి వ్యతిరేకంగా నేను మాట్లాడాను, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ మద్దతుతో డాక్టర్లు రాష్ట్రం లోని ప్రజాస్వామ్యాన్నే బెదిరిస్తున్నారు. అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకనే వారికి వ్యతిరేకంగా తన గొంతును పెంచాను” అని వివరించారు. అయితే బెనర్జీ విపక్షాలను బెదిరిస్తోందని బుధవారం బీజేపీ ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News