Monday, December 23, 2024

బ్రెయిన్ ట్యూమర్లను వేగంగా గుర్తించే ‘ఎఐ’ సాధనం

- Advertisement -
- Advertisement -

బ్రెయిన్ ట్యూమర్లను వేగంగా కచ్చితంగా గుర్తించి శస్త్రచికిత్సలో న్యూరోసర్జన్లకు సాయపడగలిగే కొత్త కృత్రిమ మేథస్సు (ఎఐ) సాధనాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈమేరకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం విడుదల చేసింది. క్యాన్సర్ రోగుల్లో సాధారణంగా కనిపించే గ్లియోమాస్ అనే బ్రెయిన్ ట్యూమర్‌ను అవగాహన చేసుకోడానికి కొన్ని దశాబ్దాలుగా న్యూరోసైన్స్ పరిశోధకులు తికమకపడుతున్నారు.

వివిధ రకాలైన గ్లియోమాస్ ట్యూమర్‌కు అనేక విధాలైన సర్జరీ అవసరమవుతుంది. ట్యూమర్ చుట్టుపక్కల కండరాలు దెబ్బతినకుండా సురక్షితంగా గ్లియోమాను నిర్మూలించడం కష్టషాధ్యమైన పని. రోగిని శస్త్రచికిత్స చేయడానికి కొన్ని క్షణాల ముందు కూడా ట్యూమర్ గురించి సరైన సమాచారం లభించదు. బ్రెయిన్ క్యాన్సర్ శస్త్రచికిత్స చేసే సమయంలో డాక్టర్లు ఆ ట్యూమర్ గురించి సరైన సమాచారం తక్షణం తెలుసుకోడానికి ట్యూమర్ తాలూకు చిన్న నమూనాను పాథాలజీ ల్యాబ్‌కు పంపుతుంటారు. డాక్టర్లు సరైన కండరాలను శస్త్ర చికిత్స చేస్తున్నారా లేదా అన్నది పాథాలజిస్టు వారికి సహకరించి చెబుతుంటారు.

అలాగే ఆ రోగికి ఎటువంటి క్యాన్సర్ ఉందో తెలియజేస్తారు. బ్రెయిన్ ట్యూమర్ నమూనాను పరీక్షించి సరైన సమాచారం 10 నుంచి 15 నిమిషాల్లో పాథాలజిస్టు ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లకు చెప్పవలసి ఉంటుంది. సర్జరీ టేబిల్‌పై రోగి కపాళాన్ని తెరిచినప్పుడే ఇదంతా జరగాలి. అయితే ఈ ప్రక్రియలో దోష నిరూపణ సరిగ్గా కాదని పరిశోధకులు చెబుతున్నారు. సర్జరీల నుంచి వచ్చే నమూనాలకు ప్రాధాన్యం ఇచ్చి మిగతా శాంపిల్స్‌ను పక్కన పెట్టవలసి వస్తుంది. ఆ సమయంలో పాథాలజిస్టు ఒత్తిడి భరించక తప్పదు.

నమూనా నాణ్యత కొన్నిసార్లు బాగుండక పోవచ్చు. అందువల్ల కొన్ని క్షణాల్లో జరిగే ఈ ప్రక్రియలో నమూనాను సరిగ్గా గుర్తించలేక పోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో గ్లియోమాను విశ్లేషించి, అత్యంత వేగంగా కచ్చితంగా నమూనాలను గుర్తించడానికి కృత్రిమ మేథ ఉపయోగపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ కొత్తరకం కృత్రిమ మేథ సాధనం కచ్చితంగా గుర్తించడం అందర్నీ ఆకట్టుకుంటోందని మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి న్యూరోసర్జన్ డాక్టర్ డాన్ కెహిల్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News