Monday, January 27, 2025

ప్రభుత్వాసుపత్రుల్లో పరికరాల నిర్వహణకు నూతన విధానం

- Advertisement -
- Advertisement -

నాలుగు కేటగిరీలుగా యంత్రాల వర్గీకరణ
పర్యవేక్షణకు పిఎంయు పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు
ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే మరమ్మత్తులు
మార్గదర్శకాలు జారీ చేసిన వైద్యారోగ్య శాఖ

New approach to equipment management in government securities

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించే యంత్రాలు, పరికరాల నిర్వహణకు ప్రభుత్వం నూతన విధానం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ మార్గదర్శకాలు జారీ చేశారు. నూతన విధానంలో ఆసుపత్రుల్లోని పరికరాలకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు చేయనున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న వైద్య పరికరాలను నాలుగు కేటగిరీలుగా విభజించారు. రూ.5 లక్షలకుపైగా విలువ ఉండి వారంటీ కలిగి ఉన్న పరికరాలు, సమగ్ర వార్షిక నిర్వహణ ఒప్పందం(సిఎఎంసి) ఇంకా ప్రారంభం కాని వాటిని ఏ కేటగీరీ-లో, రూ.5 లక్షలకు పైగా విలువ ఉండి, కంపెనీ మెయింటెనెన్స్ అవసరం ఉన్నవి, వారంటీ పీరియడ్ తర్వాత సిఎఎంసి చేసుకోవాల్సిన పరికరాలను బీ కేటగిరీ-లో, రూ.5 లక్షలకుపైగా విలువ ఉండి ఏడు సంవత్సరాలు దాటిన పరికరాలు, వారంటీ, సిఎఎంసి పూర్తయినా ఇంకా పని చేస్తున్న వాటిని సీ కేటగీరీ-లో, రూ.5 లక్షల కన్నా తక్కువ విలువ ఉన్న పరికరాలను డీ కేటగీరీలో చేర్చారు.

వీటిలో ఏ, బీ, సీ కేటగీరీ పరికరాల నిర్వహణ బాధ్యతను టిఎస్‌ఎంఎస్‌ఐడిసి, డీ-కేటగిరీలోని పరికరాల నిర్వహణను ఆయా ఆస్పత్రులు పర్యవేక్షించనున్నాయి. పరికరాల నిర్వహణను పర్యవేక్షించేందుకు టిఎస్‌ఎంఎస్‌ఐడిసిలో ప్రోగ్రామ్ మేనేజ్‌ంట్ యూనిట్ (పిఎంయు) పేరుతో ప్రత్యేక వ్యవస్థ నెలకొల్పారు. ఇందులో ఒక ప్రాజెక్టు మేనేజర్, ఒక బయోమెడికల్ ఇంజినీర్, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉంటారు. ఈ నాలుగు పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మెమీస్ పేరుతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో యంత్రాలు, పరికరాలు నిర్వహణ కోసం టిఎస్‌ఎంఎస్‌ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మెడికల్ ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఇఎంఐఎస్- మెమీస్) పేరుతో ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్‌లో పరికరాల మరమ్మతుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపిస్తే, పిఎంయు యూనిట్ నిర్ణీత గడువులోగా సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుంది. అలాగే సీ కేటగీరీలోని పరికరాల మరమ్మతుల ధరలను ఖరారు చేసేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండీ మెంబర్ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో కాళోజీ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్, డిఎంఇ,టివివిసి కమిషనర్, వైద్యారోగ్య శాఖ సాంకేతిక సలహాదారు సభ్యులుగా ఉంటారు. డీ కేటగిరీ పరికరాల నిర్వహణను సైతం ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ పరికరాల నిర్వహణకు ప్రభుత్వం టిఎస్‌ఎంఎస్‌ఐడిసి లేదా డిఎంఇకి నిధులు కేటాయిస్తుంది. అక్కడి నుంచి దవాఖానలకు నిధులు విడుదలవుతాయి. ఏడాదికి ప్రతి పడకకు పిహెచ్‌సిలకు రూ.వెయ్యి, సిహెచ్‌సిలకు రూ.1500, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రూ.2వేలు, బోధనా, స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ.2,500 చొప్పున విడుదల చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News