Wednesday, January 22, 2025

కొత్త ఆటో కొనుగోళ్లలో గోల్‌మాల్ ?

- Advertisement -
- Advertisement -

రూ.3లక్షలు 3 వాటాలుగా…
ఫైనాన్స్‌దారులు, షోరూం యజమానులు, రవాణా శాఖ అధికారుల కనుసన్నల్లోనే
కొత్త ఆటోల డెలీవరీ
కొత్త ఆటోకు రూ.2 లక్షల 60 వేల ధర ఉంటే
కొనుగోలుదారుడి నుంచి తీసుకునేది రూ.5 లక్షల 60 వేలు
ఆర్‌బిఐ నిబంధనలు పాటించని ఫైనాన్స్‌దారులు
రూ.5 లక్షల 60 వేలకు ఇన్‌వాయిస్ ఇవ్వని షోరూం యజమానులు
పట్టించుకోని రవాణా శాఖ అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఆటో ఫైనాన్షియర్‌ల ఆగడాలు ఎక్కువయ్యాయి. ఈ ఫైనాన్షియర్లు అనుమతి తీసుకోకుండానే ఈ దందాను కొనసాగించడం గమనార్హం. ప్రస్తుతం ఆటో కొనుగోళ్ల దందా ఫైనాన్షియర్లకు వరంగా మారింది. దీంతో వారు దళారుల పాత్రను సైతం పోషించడం గమనార్హం. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సిఎన్‌జి కొత్త ఆటోల కొనుగోళ్లపై నిషేధం ఉండడంతో ఫైనాన్స్‌దారులు దళారుల పాత్రను పోషిస్తున్నారు. అయితే పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఆటో కోసం రవాణా శాఖ నుంచి ప్రోసీడింగ్ తీసుకొస్తేనే ఈ కొత్త ఆటోను షోరూం యజమాని ఇస్తారు. అయితే ప్రోసీడింగ్ రాగానే ఆటోను కొననుగోలు చేసే వారు ఆ ప్రోసీడింగ్ తీసుకొని ఆటో ఫైనాన్షియర్ వద్దకు వెళతారు. మాములుగా సిఎన్‌జీ ఆటో ఇన్‌వాయిస్‌కు రూ.2 లక్షల 30 వేలు అవుతోంది. కానీ, ఇక్కడే ఫైనాన్షియర్ తన తెలివిని వాడుతాడు. ఆటోపై సుమారు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు ఫైనాన్స్ చేస్తాడు.

మొత్తం డబ్బుకు ఇన్‌వాయిస్ లేకుండానే….

అనంతరం అక్కడి నుంచి ఆటో కొనుగోలు కోసం డీలర్ దగ్గరకు వెళితే అక్కడ ఆటో ధర రూ.5లక్షల 60 వేలుగా డీలర్ పేర్కొంటారు. ఫైనాన్స్ పోనూ ఆటో కొనుగోలు చేసే వ్యక్తి మిగతా డబ్బులను డీలర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. కానీ డీలర్ ఆటోను ఇచ్చే ముందు ఇన్‌వాయిస్‌ను రూ.2 లక్షల 30 వేలకే ఇస్తారు. మిగతా డబ్బులకు రశీదు ఇవ్వకుండా ఆటోను ఇస్తారు. ఇక ఆటో రిజిస్ట్రేషన్ కాగానే ఒరిజినల్ ఆర్‌సిని ఫైనాన్షియర్ తీసుకుంటాడు. మొత్తం డబ్బులు కట్టినప్పుడు ఆ ఆర్‌సిని యజమానికి ఇస్తాడు. మాములుగా ఒక ఆటో కొనాలంటే రూ.2 లక్షలను 60 వేలను చెల్లిస్తే సరిపోతుంది. కానీ మిగతా రూ.3 లక్షలను రవాణా శాఖ అధికారులు, డీలర్‌లు, ఫైనాన్షియర్‌లు వాటాలు చేసుకుంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం ఆటోను కొనుగోలు చేసినప్పుడు తాము చెల్లించిన రూ.5లక్షల 60 వేలకు కనీసం ఇన్‌వాయిస్ ఇవ్వకపోవడం దారుణమని ఆటో యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌బిఐ నిబంధనలను పట్టించుకోని ఫైనాన్షియర్‌లు

ఇప్పటికే పాత ఆటో స్క్రాప్ విషయంలో రవాణాశాఖ అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుండగా కొత్త ఆటోల కొనుగోళ్లలో తమ మార్క్‌ను చూపించడం విశేషం. అయితే ఇక్కడ కూడా తమ చేతికి మంటిఅంటకుండా రవాణా శాఖ అధికారులు వ్యవహారిస్తున్నారని ఆటోల యజమా నులు ఆరోపిస్తున్నారు. కనీసం ఫైనాన్షియర్‌లు అగ్రిమెంట్ కాపీని సైతం తమకు ఇవ్వరని ఇలా అయితే తాము ఎలా ఫైనాన్స్ కట్టాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త ఆటోకు రూ.5లక్షల 60 వేలు తీసుకోవడంపై పలుమార్లు రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఒక్క షోరూంపై చర్యలు చేపట్టలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 200ల నుంచి 300ల ఆటో ఫైనాన్స్‌లు నడుస్తుండగా ఇందులో చాలా ఫైనాన్స్‌లు ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదని, వాటిలో చాలావాటికి కనీసం అనుమతి కూడా లేదని ఆటోడ్రైవర్‌లు ఆరోపిస్తున్నారు. కొన్నిసార్లు నెలవారీ చెల్లింపులు సక్రమంగా చేయకపోతే నోటీసులు ఇవ్వకుండానే ఫైనాన్షియర్‌లు ఆటోలను జప్తు చేసి అమ్ముకుంటున్నారని, ఆర్‌బిఐ నిబంధలకు ఇవి వ్యతిరేకమని వారు పేర్కొంటున్నారు. దీంతోపాటు ఆటోను సీజ్ చేసినప్పుడు సుమారు రూ.2 వేలు ఆటో డ్రైవర్ నుంచి ఈ ఫైనాన్షియర్‌లు వసూలు చేస్తున్నారని ఇలాంటి చర్యలతో ఆటోడ్రైవర్‌లు ఇబ్బందులు పడుతున్నారని పలువురు డ్రైవర్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News