Sunday, January 19, 2025

ఛారిటీల పేరుతో నయా బెగ్గింగ్ దందా

- Advertisement -
- Advertisement -

సంపాదించిన సొమ్ముతో ప్లాట్ల కొనుగోలు
నిందితుల అరెస్ట్, రూ.1,22,000/,
కోటి రూపాయల విలువచేసే స్థిరాస్తి పత్రాలు స్వాధీనం
సౌత్, ఈస్ట్ జోన్ డిసిపి సిహెచ్.రూపేష్ వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలో బెగ్గింగ్ మాఫియా ఆగడాలు శృతి మించుతున్నాయి. అనాథ గృహాలు, ఫౌండేషన్ల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను నగర పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి లక్షల విలువైన స్థిరాస్తి డాక్యుమెంట్లు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాము నగరంలో ఫలనా స్వచ్ఛందసంస్థ పేరుతో వృద్ధులకు, చిన్నపిల్లలకు అశ్రమాలను నడుపుతున్నామని, ఆశ్రమ నిర్వహణకు తోచినంత ఆర్ధిక సహాయం చేయగలరంటూ ట్రాఫిక్ జంక్షన్‌లలో, రోడ్లపై డొనేషన్‌బాక్స్‌లు పట్టుకుని తిరుగుతుంటారు. వీరిని చూస్తే నిజంగానే సామాజిక సేవ చేయడానికి పాటు పడుతున్నారనిపిస్తుంది. ప్రజలు తమకు తోచినంత సహాయం చేస్తుంటారు. ఆశ్రమాల నిర్వహణ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ కోట్లకు పడగలెత్తుతున్నారు.

ఏకంగా హైదరాబాద్ వంటి మహానగరంలోనే స్థలాలు కొనుగోలు చేసేంతలా దందా చేయడం విశేషం. నిరుద్యోగ యువతుల ఆర్ధిక పరిస్తితిని ఆసరాగా చేసుకుని, డబ్బులు ఎర వేస్తూ ఈ దందాలో భాగస్వామ్యం చేస్తున్నారు. మానవసేవ పేరుతో మాయ చేస్తున్న ఈ ముఠా గుట్టును నగర పోలీసులు ్టరట్టు చేశారు. ‘అమ్మ చేయూత ఫౌండేషన్’ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పట్టుకున్నారు. అమ్మ చేయూత ఫౌండేషన్ ఛైర్మన్ గణేశ్‌తో పాటు కెతావత్ రవి, మంగు మరో ఏడుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.1,22,000/, కోటి రూపాయల విలువ చేసే స్థిరాస్తి పత్రాలు, రెండు ఆటోలు, 12 కలెక్షన్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఇలా వీరు బెగ్గింగ్ దందాతో నాదర్‌గుల్, బడంగ్‌పేట్, తుర్కయంజల్‌లో రూ, 80 లక్షల విలువైన స్థలాలను కొనుగోలు చేసినట్లు సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి రూపేష్ తెలిపారు. కాగా, హైదరాబాద్‌లో రెండురోజుల క్రితమే బెగ్గింగ్ రాకెట్ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు.

నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, కెబిఆర్ పార్క్ ప్రాంతాల్లోని పలు కూడళ్లలో భిక్షాటన చేస్తున్న 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జిహెచ్‌ఎంసి అధికారులు సమన్వయంతో వారిని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. రాకెట్ నిర్వాహకుడు అనిల్ పవార్‌గా గుర్తించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద యాచకులందరి నుంచి రోజుకు 4వేల 500 నుంచి 6వేలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో వృద్ధుడికి రోజుకు రూ.200 కూలీగా చెల్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్వాహకుడిపై భిక్షాటన నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News