Sunday, April 6, 2025

కొత్త వక్ఫ్ బిల్లు సమస్యలు తెస్తుందా?

- Advertisement -
- Advertisement -

చట్టసభలు చట్టాలను చేయవచ్చు, చేయకపోవచ్చు.. కాలానుగుణంగా అవసరాల బట్టి చట్టాలను సవరించవచ్చు. అయితే ఆ పని చేసేటప్పుడు చట్టసభ సభ్యులు తులనాత్మక విధానాన్ని అనుసరించక తప్పదు. విభజన ఎజెండాకు బదులు ఎదురయ్యే అభ్యంతరాలను భవిష్య దృక్పథంతో పరిష్కరించే సూత్రం అవలంబించాలి. శాసనసభ యాధృచ్ఛికంగా ఒక సమయంలో ఒకవైపు మరోసందర్భంలో మరోవైపు లోలకాన్ని కదిలించలేదు. అటువంటి విధానం ముఖ్యంగా అనేక వైవిధ్యాలు కలిగిన భారత్ వంటి దేశంలో సమాజానికి మంచిది కాదు. అయితే దురదృష్టవశాత్తు ఇలాంటి పరిణామాలే దేశంలో తరచుగా జరుగుతుంటాయి. దేశవ్యాప్తంగా విస్తృత చర్చతోపాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు 2025 ఎట్టకేలకు పార్లమెంట్ ఆమోదం పొందింది.

రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటే వరకు విస్తృత చర్చ జరిగింది.బిల్లుకు అనుకూలంగా 129 మంది. వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. అయితే ఈ కొత్త బిల్లు కొత్తగా సమస్యలను సృష్టిస్తుందా లేక పరిష్కరిస్తుందా? అన్నదే చర్చ. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ అనగా, ఇస్లాం మతం ప్రకారం మతపరమైన లేదా దాతృత్వ కార్యాల కోసం శాశ్వతంగా అంకితమిచ్చిన ఆస్తుల నిర్వహణ, వాటిని దుర్వినియోగం కాకుండా పరిరక్షించడం, ఆయా ఆస్తులను మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాలకు వినియోగించడం తదితర అజమాయిషీకి సంబంధించి మొట్టమొదటి సమగ్రమైన చట్టం 1995లో తీసుకురావడమైంది. ఇది పూర్తిగా శాశ్వతంగా మతపరమైన ప్రయోజనాల కోసమే ఉద్దేశించబడింది. ఈ ఆస్తుల నిర్వహణ విషయంలో లౌకిక రాజ్యం పాత్ర పరిమితం.

అయితే ఈ చట్టం ఇస్లాం మత విశ్వాసాలను మించి పోయి పాక్షిక న్యాయ అధికారాల అంటే ఒక విధంగా న్యాయరహిత వక్ఫ్‌బోర్డులుగా మార్చివేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ముస్లింలు మాత్రమే వక్ఫ్‌బోర్డు పాలక వర్గాల్లో సభ్యులుగా ఉంటారు. ఈ చట్టంలోని సెక్షన్ 40 ప్రకారం ఎక్కడైనా ఏదైనా ఆస్తి వక్ఫ్ ఆస్తి అని నమ్మకం కలిగితే ఆ సమాచారాన్ని సేకరించే అధికారం వక్ఫ్‌బోర్డులకు ఉంటుంది.ఆపై నిర్ణయించే అధికారం కూడా ఉంటుంది. అంతేకాదు ఈ నిర్ణయాలను అమలు చేయాలని సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్‌లను ఆదేశించే అధికారం కూడా ఈ బోర్డులకు ఉంటుంది. ఈ అధికారాలు బోర్డులు ఫిర్యాదుదారులుగా, దర్యాప్తు సంస్థలుగా, న్యాయ వ్యవస్థలుగా తయారు చేసింది. ఇది భారతీయ న్యాయ వ్యవస్థ నిబంధనలకు, ఆచరణలకు విరుద్ధంగా ఉంటోంది. ఈ ప్రత్యేక అపరిమిత అధికారాలు దేశంలో అధిక శాతం మంది ప్రజలకు, ముస్లింలకు, ముస్లిమేతరులకు కూడా ఆందోళన కలిగిస్తోంది.

తప్పనిసరిగా దీన్ని మార్చవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు పాత చట్టంలోని సెక్షన్ 40ను పూర్తిగా రద్దు చేసింది. ఇప్పుడు ఏదైనా ఆస్తి వక్ఫ్‌ఆస్తి అనుకుంటే ప్రభుత్వ ఉన్నతాధికారి ముందు నిరూపించవలసి వస్తుంది. ఈ వెసులుబాటుకు వ్యతిరేకంగా ఎవరైనా తమ వ్యాజ్యాలను 90 రోజుల్లో హైకోర్టుకు దాఖలు చేయవలసి ఉంటుంది. ఇది స్వాగతించదగిన పరిణామం. ఈ పొరపాట్లను సవరించడం, అనేక సమస్యలను పరిష్కరించడం అనే ముసుగులో ఎన్‌డిఎ ప్రభుత్వం ఇంతవరకు పరిష్కరించిన చట్టపరమైన నిబంధనలను, రాజ్యాంగాన్ని విస్మరించి వక్ఫ్ సవరణ బిల్లు 2025ను తెరపైకి తీసుకు వచ్చింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్‌బోర్డుల వ్యవస్థల విషయంలో అపరిష్కృత విధానాలు కొత్త బిల్లులో చోటుచేసుకున్నాయి. ఇదివరకు చట్టంలో ఈ బోర్డుల్లో ముస్లింలే సభ్యులుగా ఉండేవారు. ఇస్లామిక్ మత విశ్వాసం ప్రకారం అంకితమైన ఆస్తులను పర్యవేక్షించేవారు.

ఇప్పుడు కొత్త బిల్లు ప్రకారం ఈ బోర్డుల్లో ముస్లిమేతరులకు కూడా విశేషమైన మనవిపై సభ్యులుగా చోటు కల్పించే వీలుంది. దీనివల్ల బోర్డులు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు. అలాగే దీని స్వరూపాన్ని పరిశీలిస్తే ఈ సవరణ బిల్లు రాజ్యాంగం లోని ఆర్టికల్ 26(సి), (డి)ని ఉల్లంఘించింది. ఫలితంగా ప్రతి మతాధిపత్య సంస్థ చర, స్థిర ఆస్తులను తమ స్వంతమని స్వాధీనం చేసుకోవచ్చు. చట్టప్రకారం వాటిని అజమాయిషీ చేయవచ్చు. దీనివల్ల దేశంలో మతపరమైన మైనారిటీని నిర్వహించడంలో అవాంఛనీయ ప్రమేయానికి వీలవుతుంది. వక్ఫ్ ఆస్తిని దానం చేయడంలో హక్కు పరిమితమవుతుంది. ఐదేళ్ల పాటు ఇస్లాం ఆచరించే వ్యక్తులు తమ ఆస్తిని వక్ఫ్‌కు దానం చేయాలనుకుంటే హక్కులు పరిమితం అవుతాయి. దీనివల్ల ట్రిబ్యునల్‌కు బదులు వక్ఫ్‌ఆస్తి స్వభావాన్ని నిర్ణయించే హక్కు ప్రభుత్వ అధికారికి దక్కుతుంది. పౌర చట్టం ప్రకారం ఈ వివాదాల పరిష్కారం కావాలే తప్ప అధికార యంత్రాంగ చట్టం ప్రకారం సాధ్యం కాదు.

ముస్లిం ప్రార్థనా స్థలాలపై హిందువుల వివాదాలు ఇప్పటికే ముసురుకుంటున్నాయి. కొత్త బిల్లు వల్ల ముస్లిం వక్ఫ్ ఆస్తులపై కూడా వివాదాలు పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రార్థనా స్థలాల చట్టం 1991 ని కూడా ధిక్కరించి వ్యాజ్యాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వక్ఫ్ సవరణ బిల్లు అమలులోకి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అన్న న్యాయపరమైన భయం ముస్లింల్లో వెంటాడుతోంది. ఇంతవరకు వక్ఫ్ పరిధిలో ఉన్న ఆస్తులపై హక్కులు కొత్త బిల్లువల్ల హరించబడతాయని ఆందోళన చెందుతున్నారు. మిశ్రమ స్పందనలతో కూడిన ఈ కొత్త వక్ఫ్‌బిల్లుపై కోర్టులో కూడా ప్రశ్నించే పరిస్థితి ఉంది. దీనివల్ల పాలక వ్యవస్థ ప్రయోజనం నెరవేరవచ్చు కానీ అనుకున్న దానికన్నా ఎక్కువగా వివాదాలను పరిష్కరించాల్సిన అగత్యం ఏర్పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News