10 రోజుల్లో నిర్మాణ పనులను ప్రారంభిస్తాం
9 నెలల్లో పూర్తి చేస్తాం
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: మూసారాంబాగ్, చాదర్‌ఘాట్‌లలో మూసీనదిపై కొత్త బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఇటీవల మూసీనది వరద ఉధృతికి దెబ్బతిన్న మూసారాంబాగ్ బ్రిడ్జిని శుక్రవారం మంత్రి మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, జీహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్, వాటర్ వర్క్ ఎండి దానకిషోర్‌లతో కలిసి మంత్రి తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ భారీ వర్షాలు కురవడంతో మూసీ నదికి భారీగా వరదలు వచ్చాయని, దీంతో ముసారాంబాగ్ వంతెన, పటేల్ నగర్, గోల్నాక తదితర పరిసర ప్రాంతాలు ముంపునకు గురై ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వాపోయారు. దీంతో ఈ వంతెనపై నుంచి రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ముసారాంబాగ్ వంతెన నిర్మాణం కోసం రూ.52 కోట్లు, చాదర్‌ఘాట్ వంతెన కోసం 42 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఆయన వివరించారు. ఈ బ్రిడ్జిల నిర్మాణ పనులను 10 రోజుల్లో ప్రారంభించి 9 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ వంతెనలు అందుబాటులోకి వస్తే రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని ఆయన స్పష్టం చేశారు. మూసీనది వెంట ఉన్న కాలనీలు, ఇళ్లు ముంపునకు గురికాకుండా మూసీనది వెంట అవసరమైన ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ధ్వంసమైన రహదారులను గుర్తించి ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మత్తులను చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం కింద పూర్తిస్థాయిలో నాలాల అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ చొరవతో చేపడతామని మంత్రి తలసాని వివరించారు. వచ్చే జూన్, జూలై నాటికి నాలాల అభివృద్ధి పనులు పూర్తి అవుతాయని ఆయన పేర్కొన్నారు.