టిఎస్‌పిఎస్‌సి చైర్మన్, సభ్యుల రాజీనామాల ఆమోదంతో త్వరలో కొత్త కమిషనన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తి చేసి స్పష్టతతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. నియామకాలకు సంబంధించిన ప్రక్రియ త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే టిఎస్‌పిఎస్‌సి నిర్వహించిన పలు పరీక్షలు పూర్తయినా కమిషన్ ఫలితాలు ప్రకటించలేదు.
టిఎస్‌పిఎస్‌సికి కొత్త చైర్మన్, సభ్యుల నియామకం జరిగితే పలు పరీక్షల ఫలితాలు, గ్రూప్ 2 సహా మరికొన్ని పోటీ పరీక్షల షెడ్యూల్‌తో పాటు కొత్త నోటిఫికేషన్లు వెలువడే అవకాశముంది. ఛైర్మన్, సభ్యుల నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని గతంలో హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ సహా పదిమంది సభ్యులను నియమించేందుకు అవకాశం ఉంటుంది.