సిటీ బ్యూరో: జిహెచ్‌ఎంసి కమీషనర్ డి. ఎస్.లోకేష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర అడిషనల్ చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్‌గా ఉన్నత పదవిలో నియమితులైయ్యారు. 2019 ఆగస్టు 19న జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా బాధ్యతలను చేపట్టిన లోకేష్ కుమార్ ఆ పదవిలోనే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. కొవిడ్ సమయంలో జిహెచ్‌ఎంసిలోని అన్ని విభాగాలను ఏకతాటిపై నడపడం ద్వారా ఆపద కాలంలో ప్రజలకు విశిష్ట సేవలను అందించి అందరి మన్నలను పొందారు. ఇదే క్రమంలో భారత ఎన్నికల కమిషన్ బుధవారం లోకేష్ కుమార్‌ను అడిషనల్ సిఇఓగా నియమిస్తు ఉత్తర్వులను జారీ చేసింది.
దీంతో లోకేష్ కుమార్ స్థానంలో జిహెచ్‌ఎంసికి కొత్త కమిషనర్ నియామానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఇందులో పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా గతంలో జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా పని చేసి ప్రస్తుతం జలమండలి ఎండిగా విధులు నిర్వహిస్తున్న దాన కిశోర్, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా పని చేస్తున్న రఘునందన్ రావుతో పాటు సిఎంఓలో కీలక బాధ్యతల్లో ఉన్న రాహుల్ బొజ్జతో పాటు గతంలో జిహెచ్‌ఎంసిలో అదనపు కమిషనర్‌గా పని చేసిన రొనాల్డ్ రోస్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే రానున్నది ఎన్నికల కాలం కావడం, గ్రేటర్‌కు సంబంధించి జిహెచ్‌ఎంసిదే కీలక పాత్ర కావడంతో రానున్న కొత్త కమిషనర్ ఎవరు అనేది అందరీలో ఆసక్తి పెరిగింది. రాహుల్ బొజ్జా ఇప్పటీకే హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా పని చేయడంతో ఆయనకు హైదరాబాద్‌పై పూర్తి పట్టు ఉంది.
అదే విధంగా గతంలో రఘునందన్ రావు సైతం రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా కొంత కాలం పని చేశారు. దాన కిశోర్ జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా ఉన్న సమయంలో గత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.మరో వైపు రోనాల్డ్ రోస్ సైతం ఇప్పటీకే జిహెచ్‌ఎంసిలో అదనపు కమిషనర్ హోదాలో పని చేశారు. దీంతో ఈ నలుగురికి గ్రేటర్‌పై పూర్తి అవగాహన ఉండడంతో ఈ నలుగురిలో ఒక్కరూ కొత్త కమిషనర్‌గా వస్తారా లేక మరో అధికారిని నియమిస్తారా అన్నది ఒక్కటి రెండు రోజుల్లో తేలనుంది. అయితే ఎన్నికల సమయం కావడంతో గత మూడేళ్లుగా ఒకే స్థానంలో కొనసాగుతున్న అధికారులను బదిలీ చేయలంటూ భారత ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.. దీంతో గ్రేటర్‌తో పాటు రాష్ట్రంలోను పలు అధికారులకు స్థాన చలనం కల్పించే అవకాశం ఉండడంతో లోకేష్ కుమార్ బదిలీతో పాటు మరిన్ని బదిలీలు సోమవారం లోపు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.