తురువెకెరె(కర్నాటక): కాంగ్రెస్ అధ్యక్షునిగా తదుపరి ఎన్నికయ్యే వ్యక్తి గాంధీ కుటుంబం చేతిలో రిమోట్ కంట్రోల్‌గా ఉంటారంటూ వెలువడుతున్న వార్తలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొట్టివేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్ ఇద్దరూ సొంత వ్యక్తిత్వం, అవగాహన ఉన్న నాయకులని రాహుల్ స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా శనివారం నాడిక్కడ రాహుల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను చేపట్టిన పాదయాత్రలో తాను ఒంటరిని కానని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, అసమానతలతో విసిగి వేసారిపోయిన లక్షలాది మంది ప్రజలు తనతో నడుస్తున్నారని అన్నారు. తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడు గాంధీ కుటుంబం చేతిలో రిమోట్ కంట్రోల్‌గా ఉంటారని వస్తున్న విమర్శలను విలేకరులు ప్రస్తావించగా అధ్యక్ష బరిలో నిలిచిన ఇద్దరు నాయకులు సొంత వ్యక్తిత్వం, సొంత దృక్పథం, సొంత ఆలోచనలు ఉన్న వ్యక్తులని, వారిలో ఎవరూ రిమోట్ కంట్రోల్‌గా ఉండబోరని, నిజానికి..ఈ మాటే వారిద్దరినీ అవమానించడమని రాహుల్ వ్యాఖ్యానించారు.
హింసను వ్యాప్తి చేయడం జాతి వ్యతిరేక చర్య అవుతుందని, దీనికి పాల్పడేవారు ఎవరైనా తాము పోరాడతామని ఆయన చెప్పారు. మన చరిత్రను, సాంప్రదాయాలను వక్రీకరించే నూతన విద్యా విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. తాము వికేంద్రీకర విద్యా విధానాన్ని కోరుతున్నామని ఆయన చెప్పారు. తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర 2024 పార్లమెంట్ ఎన్నికల కోసం కాదని, దేశంలో చీలికలు తెస్తున్న బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేయడమే కాంగ్రెస్ ఆశయమని రాహుల్ చెప్పారు. జాతీయ భాషగా హిందీ ఒక్కటే ఉండాలన్నది తమ పార్టీ సిద్ధాంతం కాదని, దీని వల్ల కన్నడ వంటి ప్రాంతీయ భాషల ఉనికికే ముప్పు ఏర్పడగలదని రాహుల్ స్పష్టం చేశారు.
New Congress Chief will not be remote control: Rahul