మహబూబ్ నగర్ : 10 ఎకరాల విశాలమైన స్థలంలో 16 కోర్టులతో భవన నిర్మాణం చేపడుతున్నామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ న్యాయవాదులు చిరకాలంగా ఎదురుచూస్తున్న మహబూబ్ నగర్ జిల్లా నూతన కోర్టు భవన నిర్మాణ పనులు జాతీయ రహదారి చెంతనే సువిశాల స్థలంలో త్వరలోనే ప్రారంభం కానున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న బండమీదిపల్లిలో 10 ఎకరాల స్థలంలో త్వరలోనే నూతన కోర్టు భవన నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం అయన బండమీదిపల్లిలో అధికారులు, అడ్వొకేట్ల తో కలిసి నూతన కోర్టు భవన నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ… గడచిన 10, 20 ఏళ్ల నుండి అడ్వకేట్లు, జడ్జిలు సరైన వసతులు లేక పాత కోర్టు భవనంలో సుమారు 16 కోర్థులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే సిఎం కేసిఆర్ వివరించగా 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు. పశు సంవర్థక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్మించనున్న ఈ కోర్టు భవనం అన్ని హంగులతో నిర్మిస్తామని, 3 రహదారులు ఈ కోర్టు భవనానికి అనుసంధానంగా ఉంటాయన్నారు. బైపాస్ రహదారితో పాటు, మహబూబ్ నగర్ టౌన్ కు వెళ్లే మరో రహదారి, మహబూబ్ నగర్- రాయచూరు వెళ్లే ఇంకో రహదారితో అన్ని సౌకర్యాలతో ఇటు అడ్వకేట్ లకు, అటు న్యాయమూర్తులు, కక్షిదారులకు, బార్ అసోసియేషన్ కు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆయన సూచించారు. అందరికి ఉపయోగపడే విధంగా సకల సౌకర్యాలతో కోర్టు భవనాన్ని నిర్మిస్తామని అన్నారు.
ఈ నూతన కోర్టు భవనం నుండి నూతన కలెక్టరేట్ కు కేవలం 5 నిమిషాల్లో వెళ్లవచ్చని మంత్రి సూచించారు. పశుసంవర్ధక పాలిటెక్నిక్ కు ఇబ్బంది కలగకుండా అదనపు స్థలాన్ని కేటాయిస్తామన్నారు. పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని, ప్రతి ఒక్కరు పార్టీలకతీతంగా తమతో కలిసి వచ్చి అభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కె.సి నర్సింహులు, సీనియర్ అడ్వకేట్ ప్రతాప్ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బెక్కెం జనార్ధన్, స్వదేష్ కుమార్, గవర్నమెంట్ ప్లీడర్ మనోహర్, బార్ ఆసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి, కార్యదర్శి లక్ష్మారెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మురళీకృష్ణ తదితరులు ఉన్నారు