Sunday, September 22, 2024

దేశంలో కొత్తరకం కరోనాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఎన్ 440కె, ఇ484కె వేరియంట్లు

కరోనా పెరుగుదలకు ఈ రెండు వేరియంట్లు కారణమని చెప్పలేం : కేంద్రం

New Covid 19 Strains in India

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు చెందిన స్ట్రెయిన్ కరోనా వైరస్‌లను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా (ఎన్440కె, ఇ 484కె) వేరియంట్లు ఉన్నాయని, తెలంగాణలోనూ ఈ వేరియంట్లు ఉన్నట్లు పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 187 మందిలో యూకే స్ట్రెయిన్ బయటపడినట్లు వెల్లడి చేసిన మంత్రిత్వశాఖ ఆరుగురిలో దక్షిణాఫ్రికా స్ట్రెయిన్, ఒకరిలో బ్రెజిల్ స్ట్రెయిన్ గుర్తించినట్లు తెలిపింది. అయితే కేసుల పెరుగుదలకు అవే కారణంగా చెప్పలేమని స్పష్టం చేసింది. దేశం లో కరోనా టీకాల పంపిణీ శరవేగంగా సాగుతోందన్న ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.. మంగళవారం మధ్యా హ్నం ఒంటిగంట వరకు 1,17,54,788 టీకా డోసులు పంపిణీ చేసినట్లు తెలిపారు. వీటిల్లో 1,04,93,205 మొదటి టీకా డోసులు కాగా.. 12,61,583 రెండో టీకా డోసులు ఉన్నాయని పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ సహా 11 రాష్ట్రాల్లో 60 శాతం కంటే తక్కువ మంది వైద్య సిబ్బందికి తొలి టీకా డోసు అందించినట్లు రాజేశ్ భూషణ్ వెల్లడించారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా 12 రాష్ట్రాల్లో 75 శాతం మందికి పైగా వైద్య సిబ్బందికి మొదటి డోసు టీకా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. దేశంలో 1.50 లక్షల యాక్టివ్ కేసులుండగా.. అందలో 75 శాతం మహారాష్ట్ర, కేరళలోనే ఉన్నాయని ఆరోగ్యశాఖ కార్యదర్శి తెలిపారు. గత 92 వారాలుగా రోజూవారి కరోనా మరణాలు 100 లోపే ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ రేటు 5.19 శాతంగా ఉందన్న ఆరోగ్యశాఖ కార్యదర్శి ఇది క్రమంగా తగ్గుతోందన్నారు. దేశంలో తాజాగా 10 వేలకు పైగా కరోనా కేసులు రాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11 మిలియన్లు దాటిపోయింది. ఇప్పటివరకు 10.7 మిలియన్ల మంది కోలుకోగా.. 1.56 లక్షల మంది మృత్యువాత పడ్డారు.
ఆ జిల్లాలోనే కేసులు అధికం..
దేశవ్యాప్తంగా ఉన్న 718 జిల్లాలకు గానూ, 31 జిల్లాల్లో రోజుకు 100కు పైగా కేసులు వస్తున్నాయి. వాటిలో కేరళలో మొత్తం 13 జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదవుతున్నా యి. మహారాష్ట్రలోనూ 13 జిల్లాల్లో 100కు పైగా కొత్త కేసు లు వస్తున్నాయి. 20వ తేదీన అమరావతి జిల్లాలో ఒక రోజు వెయ్యి కేసులు నమోదయ్యాయి. ముంబై, పుణే, థానే, అమరావతి, నాగ్‌పూర్ జిల్లాల్లో రోజుకు 500కు పైగా నమోదవుతున్నాయి. గత వారంలో కేరళలో ప్రతి పదిలక్షల జనాభాలో 750 మందికి కొత్తగా వైరస్ సోకింది. ఈ సంఖ్య దేశంలోనే ఎక్కువ. అలాగే మహారాష్ట్రలో పది లక్షల జనాభాకు గత వారంలో 250 మందికి కొత్తగా వైరస్ సోకింది. ఈ సంఖ్య దేశంలోనే ఎక్కువ. అలాగే మహారాష్ట్రలో పది లక్షల జనాభాకు గత వారంలో 250 మందికి వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా తీసుకుంటే సగటున ప్రతి పది లక్షల్లో గత వారంలో 60 మందికి కరోనా సోకింది. తెలంగాణలో 40 మందికి సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా కేరళలో పంచాయతీ ఎన్నికలు, ఓనం పండుగ తర్వాత భారీగా కేసులు పెరిగాయి. అప్పట్నించీ అదే ట్రెండ్ కొనసాగుతూ ఉంది.
తెలంగాణలో వారంలో ఒకసారి మాత్రమే కేసుల వెల్లడి..
రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కేసులలో కొన్ని రోజులుగా పెద్దగా మార్పు లేని కారణంగా ఇకపై వారానికి ఒకరోజు మాత్రమే కరోనా కేసుల వివరాలను వెల్లడించాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరక ప్రజారోగ్య సంచాలకులు ఓ ప్రకటన విడుదల చేశారు. దాదాపు ఏడాది కాలంగా కోవిడ్ కేసు ల వివరాలను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ సిబ్బందిని వ్యాక్సినేషన్ కోసం వినియోగించే లక్షంతో ఈ మేరకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రతివారం జిల్లాలో నమోదైన మొత్తం కేసుల వివరాలతో పాటు ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి వివరాలు, ఆసుపత్రుల్లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారి వివరాలను తెలపనున్నారు.
ఆదిలాబాద్ వాసులను వెంటాడుతున్న భయం..
ఏడాది కాలంగా ముప్పతిప్పలు పెడుతున్న కరోనా మహమ్మారి భయం ఇంకా వీడడం లేదు. 2020 ఏడాది మొత్తం కరోనా భయంతోనే గడిచిపోయింది. తాజాగా 2021లోనూ దీని ప్రభావం పూర్తిగా తొలగిపోనప్పటికీ.. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఎక్కడ్నించీ ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనని జనం ఇంకా ఆందోళనతోనే ఉన్నారు. ఈ రెండు నెలల నుంచి కరోనా ఉద్ధృతి తగ్గిందని కొంత ఉపశమనం పొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు పొరుగు భయం వెంటాడుతోంది. జిల్లా సరిహద్దున న్న మహారాష్ట్రలో రెండో దశ కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చడంతో ఆ ప్రభావం జిల్లాపై పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. విదర్భ ప్రాంతంలోని యవత్‌మాల్, అకోలా తదితర జిల్లాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఈ ప్రభావం జిల్లాపై పడే అవకాశం ఉంటుందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ముందస్తుగా అప్రమత్తమై నివారణ చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే జిల్లాలో 55 శాతం మందికి టీకా వేయడం పూర్తయింది. ప్రైవేటు వారికి టీకా అందించేందుకు సన్నద్ధమవుతోంది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు జిల్లాలో 2.37 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5130 మందికి పాజిటివ్ వచ్చిన వారిలో చాలా మంది కోలుకున్నారు. పరిస్థితి క్షీణించి పలువురు మృతి చెందారు. నెమ్మదిగా పరిస్థితి కుదుటపడిందనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. కరోనా తీవ్రస్థాయిలో ఉండటంతో పొరుగునే ఉన్న జిల్లాపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. బస్సులు, ప్రైవేటు వాహనాలు తిరుగుతున్నాయి. జిల్లా సరిహద్దున అనేక గ్రామాల ప్రజలకు విదర్భ ప్రాంత ప్రజలకు సత్సంబంధాలు, బంధుత్వాలున్నా యి. ఫంక్షన్లకు కూడా వెళ్లి వస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో జనాలు వివిధ పనుల నిమిత్తం సరిహద్దు దాటి జిల్లాకు రావడం, పోవడం చేస్తున్నారు. తాజాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. యవత్‌మాల్ జిల్లాలో రాత్రివేళల్లో కర్ఫూ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసులు మరింత పెరిగితే పూర్తిగా లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని సమాచారం. అప్రమత్తమైన యంత్రాంగం కొన్ని రోజులుగా పక్కనే ఉన్న మహారాష్ట్రలో మళ్లీ కరోనా విజృంభించడంతో సరిహద్దునున్న జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. టీకా వచ్చిన తర్వాత ఆయా శాఖలకు చెందిన కరోనా యోధులు 6913 మందిని గుర్తించి 3276 మందికి టీకా వేశారు. మరో 435 మంది ప్రైవేటు వ్యక్తులకు టీకా అందించినట్లు అధికారులు చెబుతున్నారు. సరిహద్దున ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేశారు. ఎవరైనా మహారాష్ట్ర నుంచి ఎవరైనా జిల్లాల్లోకి ప్రవేశిస్తే వెంటనే సమాచారం అందించాలని స్పష్టం చేశారు. వారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వాసులు కరోనా నిబంధనలు పాటిస్తేనే దీని భారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగించడం, భౌతిక దూరం పాటించడం లాంటివి కొనసాగించాలని సూచిస్తున్నారు.

New Covid 19 Strains in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News