Wednesday, January 22, 2025

1950 రాత్రి ఢిల్లీ రంగులకలకళ

- Advertisement -
- Advertisement -

బుక్‌ఫెయిర్ వేదికగా కనులముందుకు

న్యూఢిల్లీ : 1950 జనవరి 26 నాటి ముస్తాబులు సోయగాల దేశ రాజధాని ఢిల్లీ ఏ విధంగా ఉంది? ప్రతీకాత్మక భనవాలు, చారిత్రక కట్టడాలు, పార్క్‌లు, రైల్వే స్టేషన్లు ఏ విధంగా మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపాల కాంతుల్లో మెరిసిపొయ్యాయి. ఆ రాత్రి అత్యంత అద్భుతాలతో ఢిల్లీ ఏ విధంగా మయసభగా తన ఠీవీ చాటుకుంది? దేశ తొలి రాష్ట్రపతిగా బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రమాణస్వీకారం తరువాత అప్పటి ఇర్విన్ స్టేడియం ( ఇప్పటి మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియం)లో తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంత ఉత్సాహంతో జరిగాయి? అనే అంశాల సంబంధిత చిత్రాలన్ని ఇప్పుడు ఇక్కడ పూర్తిగా తీర్చిదిద్దిన ప్రగతిమైదాన్‌లో జరుగుతోన్న వరల్డ్ బుక్ ఫెయిర్‌లో అందరిని ఆకట్టుకునే విధంగా అలరిస్తున్నాయి.

పార్లమెంట్ మ్యూజియం, ఆర్కివ్స్ నుంచి సేకరించి ఈ అలనాటి మేటి ఘట్టాల చిత్రాలను, దేశం గణతంత్రం అయిన దశలో జనం కేరింతలు భావోద్వేగాల ఘట్టాలను తెలిపే ఫోటోలను ప్రపంచ పుస్తక ప్రదర్శనలో జనం వీక్షణకు పెట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన దశలో ఈ ఏడాది ఈ పుస్తక మహొత్సవానికి ఇతివృత్తాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా ఖరారు చేశారు. ఢిల్లీలోని పాత రాజరిక భవనాలు, చారిత్రక కట్టడాల నీలినీడలు , దేశ గణతంత్ర స్వేచ్ఛా స్వాతంత్య్రాల ప్రాంగణపు వెలుగు జాడల్లోకి క్రమేపీ చేరుకుంటూ ఉన్న అత్యంత సుందరమైన ఘట్టాల గురించి బుక్‌ఫెయిర్‌లో ప్రత్యేక ప్రదర్శనగా పెట్టారు. తొలి రిపబ్లిక్ డేరోజున ఢిల్లీ పేరిట ఎనిమిది చిత్తరువులను సంబంధించిన పత్రికల వార్తలతో పొందుపర్చి ఇక్కడ ఉంచారు. రిపబ్లిక్ డే రోజున రాజధాని మయసభ అయిందనే శీర్షికతో ఫోటోలను పెట్టారు. ఇక్కడి క్లాక్ టవర్‌ను బ్రిటిష్ వారు 1870లో నిర్మించారు.

చాందినీ చౌక్‌లో వెలిసిన ఈ క్లాక్‌టవర్ నుంచి గంటకు ఓసారి గంటలు విన్పించడం ద్వారా ఇది ఘంటాఘర్‌గా ప్రసిద్థి పొందింది. 70 ఏండ్ల క్రితం వరకూ ఇది ఢిల్లీని తన గంటలమేల్కోలుపులతో నిద్రలేపింది. అయితే ఇప్పుడు ఘంటాఘర్ లేకపోయినా ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ ప్రజలు ఈ పేరుతోనే పిలుస్తారు. 1950 నాటి చిత్రహారంలో టౌన్‌హౌల్, ఇండియాగేట్, రాజ్‌ఘాట్, పార్లమెంట్ వద్ద ఫౌంటెన్స్, ఓల్ ఢిల్లీ రైల్వే స్టేషన్, గార్డెన్స్ ఏ విధంగా విద్యుత్ దీపాలతో ముస్తాబు అయి ఉన్నాయి? ఓ పెను గతం నుంచి ఓ సరికొత్త ఆవిష్కరణకు ఏ విధంగా ముస్తాబు అవుతూ ఢిల్లీ కన్పించిందనేది కొట్టోచ్చినట్లు ఈ బుక్‌ఫెయిర్‌లోని చిత్రాలతో తెలుసుకోవచ్చునని స్థానిక పత్రికలు ఈ ఎగ్జిబిషన్‌పై సమీక్షలు వెలువరించాయి. తొలి గణతంత్ర దినోత్సవ ఘట్టాలను అపురూపంగా చరిత్రకు అందించిన ఘనత ఢిల్లీలోని ఏ ఆర్ దత్తా అండ్ సన్స్ స్టూడియో వారిదే. ఢిల్లీలో ఇది అత్యంత ప్రాచీన ఫోటోస్టూడియోగా నిలిచింది.

ఈ స్టూడియో వ్యవస్థాపకులు ఏఆర్ దత్తా మనవడు అనూజ్ దత్తా ఈ ఫోటోల ఫ్లాష్‌బ్యాక్ గురించి తెలిపారు. తన తాత ఢిల్లీలో అత్యంత కీలకమైన చారిత్రక సమావేశాలు , ప్రదర్శనలు జరిగినప్పుడు ఒకే ఫ్రేములో ఈ దృశ్యాలు ఇమిడిపొయ్యేలాఫోటోలు తీసేవారు. ఇందుకు ఓ అత్యద్భుతమైన బ్రాండ్ కెమెరాను వాడేవారని, ఇప్పుడు ఇక్కడి ఎగ్జిబిషన్‌లో అప్పట్లో తమ తాత తీసిన ఫోటోలు చరిత్రను కళ్ల ముందుంచేలా చేయడం తనకు ఆనందదాయకం అన్నారు. పలు విశేషాల ఆకర్షణలతో కూడిన బుక్‌ఫెయిర్ 8 రోజుల పాటు సాగి ఆదివారం ముగిసింది. అయితే ఢిల్లీ పాతనిండుదనం గురించి తెలిపే అప్పటి ఫోటోలు కలకాలపు నిలిచిపొయ్యే జ్ఞాపకాలుగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News