ముంబై : కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలా మందిలో బ్లాక్, గ్రీన్, యెల్లో ఫంగస్‌లు వ్యాపించడం, కొందరు మృతి చెందడం తెలిసిందే. ఇవి కాక మరో రెండు కొత్త రోగాలు పట్టి పీడిస్తున్నాయి. ఇందులో ఒకటి బోన్‌డెత్‌గా పిలిచే అవాస్కులర్ వెక్రోసిస్ కాగా, మరొకటి గాల్ బ్లాడర్‌లో నొప్పి. వాపు కనిపించడం. మహారాష్ట్రలో కరోనా నుంచి కోలుకున్న వారిలో బోన్‌డెత్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముంబై లోని హిందుజా ఆస్పత్రిలో ఇలాంటి మూడు కేసులు బయటపడ్డాయి. అలాగే గత ఆరు వారాల వ్యవధిలో 40 మంది అవాస్యులర్ వెక్రోసిస్ కు గురయ్యారు.
అహ్మద్ నగర్‌కు చెందిన ఒక డాక్టర్ కరోనా నుంచి కోలుకున్న తరువాత ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో 17 మంది ఈ వ్యాధికి గురై సర్జరీ చేయించుకున్నారు. అవాస్కులర్ వెక్రోసిస్ లేదా బోన్‌డెత్ అంటే సరిపడా రక్తం లేక ఎముక కణజాలం చనిపోవడం. దీనివల్ల ఎముకలో పగుళ్లు ఏర్పడి మెల్లగా అది మొత్తం పనికి రాకుండా పోతుంది. స్టెరాయిడ్లు ఎక్కువగా తీసుకోవడం, ఆల్కహాలు ఎక్కువగా సేవించడం వల్ల ఈసమస్య వస్తుందని డాక్టర్లు చెప్పారు. 30 నుంచి 50 ఏళ్ల లోపు వారిలో ఇది కనిపిస్తోంది. ఇక గాల్‌బ్లేడర్ సమస్యలు ఢిల్లీ రోగుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. పిత్తాశయంలో వాపు, నొప్పి, సమస్యలు ఢిల్లీ డాక్టర్లు గుర్తించారు.
New diseases in those who recovered from covid