న్యూఢిల్లీ : విదేశాలకు ప్రయాణాలు చేసే వారి కోసం కొత్తగా ఈ-పాస్‌పోర్ట్‌ను తీసుకువస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2019లో తొలిసారి ఈ విధానాన్ని కేంద్రం ప్రకటించినప్పటికీ అది అమలు కాలేదు. ఈ ఏడాది నుంచే వీటి జారీని ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కొత్త విధానం వల్ల ప్రయాణికులకు ఎంతో భద్రత, ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ప్రయాణాల సమయంలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సులభతరం అయ్యేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఈ-పాస్‌పోర్ట్ ప్రధాన ఫీచర్లను మంత్రి వెల్లడించారు. ఈ-పాస్‌పోర్ట్ వెనక భాగంలో చిన్న సిలికాన్ చిప్ ఉంటుందన్నారు. ఈ చిప్‌లో 64 కిలోబైట్ల మెమొరీ స్పెస్ ఉంటుందని, ఈ చిన్న చిప్‌లోనే పాస్‌పోర్టుదారుడి ఫొటో, ఫింగర్ ప్రింట్‌తో సహా అన్ని వివరాలు నిక్షిప్తమై ఉంటాయ్నారు. పాస్‌పోర్ట్‌లోని వివరాలతో పాటు బయోమెట్రిక్ డీటైల్స్ కూడా ఈ చిప్‌లో స్టోర్ అయి ఉంటాయన్నారు. వినియోగదారుడు ఒకసారి తీసుకున్న ఈ-పాస్‌పోర్ట్‌పై 30 విజిట్స్ చేయవచ్చునని తెలిపారు. అంతేగాక అమెరికాలోని ప్రముఖ లేబొరేటరీలో మొదట ఈ ఈ-పాస్‌పోర్ట్ నమూనాను పూర్తిగా పరీక్షించి, ఎలాంటి లోటుపాట్లు లేవని తేలిన తర్వాతే వాడకంలోకి అనుమతిస్తారని వివరించారు.