Thursday, November 21, 2024

భూపాలపల్లిలో మరో మూడు కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భూపాలపల్లిలో కొత్తగా మరో మూడు విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుత విద్యుత్ సరఫరా అవసరాల మేరకు వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సుమారు రూ. 250 కోట్ల అంచనా వ్యయంతో కొత్త సబ్ స్టేషన్లను ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో 400 కెవి / 220 కెవి/132 కెవి విద్యుత్ సబ్ స్టేషన్లు ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 400 కెవి సబ్ స్టేషన్‌లు 6 మాత్రమే ఉంటే.. వాటి సంఖ్య ప్రస్తుతం 23కి పెరిగింది. అలాగే 220 కెవి సబ్ స్టేషన్లు 51 మాత్రమే ఉంటే ఇప్పుడు 98 ఏర్పాటు చేశారు. అంతే కాదు 132 కెవి సబ్ స్టేషన్‌లు 176 మాత్రమే ఉండగా ఇప్పడు తెలంగాణ రాష్ట్రంలో 247 పెంచారు.

మరో వైపు వినియోగదారుల అవసరాల మేరకు వాటి సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో భూపాలపల్లిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ల పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త సబ్ స్టేషన్ల స్థలాల్లో అటు భవనాల నిర్మాణంతో పాటు లైనింగ్ పూర్తి చేసేందుకు మరో నాలుగు ఐదు మాసాల సమయం పట్టవచ్చని విద్యుత్ శాఖ ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భూపాలపల్లి జనరేషన్ అంతా గజ్వేల్ , వరంగల్ పవర్ గ్రిడ్‌కు వెళ్తుండడంతో భూపాలపల్లి పరిసరాలకు సరిపడా విద్యుత్‌ను అందుబాటులో ఉంచుకునేందుకు కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటు తప్పనిసరి అవుతోందని అధికారులు చెబుతున్నారు.
భూపాలపల్లిపై కేంద్రం ఆరా…:
తెలంగాణలోని భూపాలపల్లి థర్మల్ విద్యుత్ కేంద్రంపై కేంద్ర ప్రభుత్వం కన్నేసింది. ఇక్కడకు బొగ్గు సరఫరా సహా అవసరమైన వాటిని ఆపి ఇతర రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గు నిల్వలు తగ్గి విద్యుత్ సంక్షోభానికి దారి తీసే పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖలు బొగ్గు నిల్వలపై తరుచూ బొగ్గు నిల్వలపై సమీక్షలు నిర్వహించుకుంటున్నాయి. అందులో భాగంగా తెలంగాణతో పాటు బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలలో బొగ్గు గనులున్న ప్రాంతాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉన్న బొగ్గు నిల్వలపై ఆరా తీస్తోంది.

దేశంలో 116 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజు ఎంత బొగ్గు సరఫరా చేస్తున్నారు.. ఎంత నిల్వలున్నాయో ఎప్పటికప్పుడు విచారణ జరిపుతోంది. మొత్తం విద్యుత్ కేంద్రాల్లో 4 చోట్ల మాత్రమే 13 రోజుల పాటు కరెంటు ఉత్పత్తి అవసరానికి మించి బొగ్గు నిల్వలున్నట్లు తేలింది. వాటిలో భూపాలపల్లి విద్యుత్ కేంద్రంలో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించి బొగ్గు నిల్వలపై నిరంతరం సమీక్షిస్తూ కేంద్రం పలు సూచనలు చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News