హైదరాబాద్ : రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కొత్త విద్యుత్ ఛార్జీలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా విద్యుత్ సంస్థలకు అవసరమైన నిధులు, ఆదాయం, ఖర్చులకు సంబంధించి కూడా ఈఆర్‌సి ఆమోదం తెలిపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 202324 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ రంగానికి మొత్తం 52,006 కోట్ల 78 లక్షల రూపాయల నిధులను ఖర్చు చేసుకోవడానికి వీలుగా ఈఆర్‌సి అనుమతించింది. విద్యుత్ సంస్థలు 54 వేల 58 కోట్ల 35 లక్షల నిధులు అవసరం అవుతాయని ఈఆర్‌సికి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. కాగా వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు యాధావిధిగా అమలవుతాయి.
ఇటు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగానికి మొదటి 50 యూనిట్లకు గాను ఒక్కో యూనిట్ ధర ఒక రూపాయి 95పైసల ఛార్జీని వసూలు చేస్తారు. 51వ యూనిట్ నుంచి 100 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 3.10 పై వసూలు చేసుకునేందుకు వీలుగా డిస్కంలకు ఈఆర్‌సి అనుమతి ఇచ్చింది. 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల విద్యుత్తును వినియోగించే వినియోగదారులకు మొదటి వంద యూనిట్లకు ఒక్కో యూనిట్ ధర రూ. 3.40 పై వసూలు చేసుకోవచ్చు. 101 వ యూనిట్ నుంచి 200 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 4.80 పైల చొప్పున ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు. 200 యూనిట్లకు పైగా కరెంటును వాడుకునే వినియోగదారులకు మొదటి 200 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 5.10 పైసలు ఛార్జీలు వసూలు చేస్తారు.
201 నుంచి 300 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 7.70 పైసలు అలాగే 301 నుంచి 400 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 9 గా ఛార్జీలను నిర్ణయించారు. 401 నుంచి 800 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 9.50 పైసలుగాను అలాగే 800 యూనిట్లు ఆ పైన కరెంటును వినియోగించుకునే వినియోగదారుల నుంచి రూ. 10 చొప్పున వసూలు చేసేలా ఈఆర్‌సి విద్యుత్ ఛార్జీల శ్లాబ్‌లను ఖారారు చేసింది. వాణిజ్య రంగంలో విద్యుత్తు వాడుకునే వారికి మొదట 50 యూనిట్లకు గాను ఒక్కో యూనిట్ ధర రూ. 7, అలాగే మొదటి 100 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 8.50 పైసలకు కరెంటును సరఫరా చేస్తారు. కమర్షియల్ విద్యుత్తు సరఫరాలో 101 నుంచి 300 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 9.95 పైసలుగాను, 301 నుంచి 500 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 11 గాను ఈఆర్‌సి ఖరారు చేసింది. ఇందులోనూ హెయిర్ కటింగ్ సేలూన్లకు మూడు రకాల విద్యుత్ ఛార్జీలను ఈఆర్‌సి ఖరారు చేసింది.
సెలూన్లకు మొదటి 50 యూనిట్లకు గాను ఒక్కో యూనిట్‌కు రూ. 5.30 పై.లు, 51 నుంచి 100 యూనిట్లకు ఒక్కో యూనిట్ ధర రూ. 6.60 పైసలు, 101 నుంచి 200 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 7.50 పై.లుగాను ఛార్జీలను ఈఆర్‌సి ఖారారు చేసింది. పరిశ్రమలకు యూనిట్ కాస్ట్ రూ. 7.70 పై.లు, సీజినల్ పరిశ్రమలకు యూనిట్ ధర రూ. 8.40 పై.లు, షుగర్‌కేన్ క్రషింగ్, రోయ్యల చెరువులకు యూనిట్‌కు రూ. 6.20 పై.లు , పౌల్ట్రీ ఫామ్స్‌కు రూ. 7, గొర్రెలు, మేకల ఫాంలకు యూనిట్ ధరగా రూ. 7.30 పై.లుగా , ఇతర కాటేజీ పరిశ్రమలకు రూ. 4 గాను ఛార్చ్ చేస్తారు. కాగా కార్పొరేట్ వ్యవసాయం చేసే రైతులకు యూనిట్ ధర రూ. 2.50 పైసలుగాను, ఉద్యానవనాలకు యూనిట్ ధర రూ. 4 గాను, పంచాయతీలు, వీధి లైట్లకు రూ. 7 గాను, మున్సిపాలిటీలకు రూ. 7.60 పై.లుగాను ,
పురపాలక పట్టణాల్లోని వీధి లైట్లకు ఒక్కో యూనిట్ ధర రూ. 8.10 పై.లుగాను నిర్ణయించారు. కొత్త ఆర్థిక సంవత్సరం 202324లో విద్యుత్ కొనుగోలులో యూనిట్ ధర రూ. 4.39 పైసలకు తగ్గిందని ఈఆర్‌సి ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు సబ్సిడీ కింద 9వేల 124 కోట్ల 22 లక్షల రూపాయలను భరించనుందని ఈఆర్‌సి తెలిపింది. ఇందులో వ్యవసాయ రంగానికి సబ్సిడీగా 7743 కోట్ల 80 లక్షల రూపాయలను సబ్సిడీగా విద్యుత్ సంస్థలకు నిధులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఈఆర్‌సి తెలిపింది. గృహ విద్యుత్‌పైన కూడ తెలంగాణ ప్రభుత్వం 1381 కోట్ల 2 లక్షల రూపాయల సబ్సిడీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఈఆర్‌సి తెలిపింది. గత ఏడాది 8221 కోట్ల రూపాయల సబ్సిడీగా భరించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏడాదిలో 9124 కోట్ల 82 లక్షల రూపాయలను భరించనుందని ఇది గత ఏడాది కంటే 11 శాతం అదనంగా సబ్సిడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించనుందని ఈఆర్‌సి తెలిపింది.