Saturday, November 16, 2024

లోటులో డిస్కంలు

- Advertisement -
- Advertisement -

New electricity charges from April 1st: ERC Sriranga rao

ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు

2021 22 సంవత్సరానికి రూ.10,624 కోట్లు 2022 23 సంవత్సరానికి రూ.10,928 కోట్లు మూడు డిస్కంలు ఏఆర్‌ఆర్‌లను సమర్పించాయి
రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక పారిశ్రామిక విధానం, ప్రతిష్టాత్మక వ్యవసాయం, బహుళ ప్రయోజక లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కారణంగా విద్యుత్ డిమాండ్ పెరిగింది
కొన్నేళ్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు ప్రభుత్వ సబ్సిడీలు సకాలంలో వస్తున్నప్పటికీ డిస్కంలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నాయి : ఇఆర్‌సి చైర్మన్ శ్రీరంగారావు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర విద్యుత్ శాఖకు భారీగా రెవెన్యూ లోటు పెరిగిందని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ (ఈఆర్సీ) శ్రీరంగారావు పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు వార్షిక రెవెన్యూ నివేదికను సమర్పించాయని, విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను సమర్పించలేదని ఆయన తెలిపారు. డిస్కంలు ఏఆర్‌ఆర్‌లను ఈఆర్సీకి సమర్పించడంతో చైర్మన్ శ్రీరంగారావు, సభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీరంగారావు మాట్లాడుతూ 2021, 22 ఆర్థిక సంవత్సరానికి రూ.45,618 కోట్ల నిధులు అవసరమవుతాయని విద్యుత్ శాఖ అంచనా వేయగా, ఇందులో ప్రస్తుతం అమల్లో ఉన్న చార్జీల రూపంలో ఈ శాఖకు రూ.29,343 కోట్ల ఆదాయం సమకూరుతుందని, మిగిలిన రూ.16,276 కోట్లకు గాను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో డిస్కంలకు రూ.5,652 కోట్లను చెల్లించగా మిగిలిన రూ.10,624 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతోందని శ్రీరంగారావు తెలిపారు.

దీంతోపాటు 2022, 23 ఆర్థిక సంవత్సరానికి రూ.53,053 కోట్ల నిధులకు గాను చార్జీల రూపంలో రూ.36,474 కోట్ల ఆదాయం రాగా, మిగిలిన 16,579 కోట్లకు గాను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రూ.5వేల కోట్లను చెల్లిస్తుందని, దీంతో రూ.10,928 కోట్లు రెవెన్యూ లోటు ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. మూడు డిస్కంలు (ఎస్‌పిడిసిఎల్, ఎన్‌పిడిసిఎల్, సిరిసిల్లలోని సెస్)లు ఏఆర్‌ఆర్‌లను సమర్పించాయని, టారిఫ్‌లను సమర్పించలేదని ఆయన తెలిపారు. డిస్కంలు సమర్పించినప్పుడు ఏఆర్‌ఆర్‌లతో పాటు టారిఫ్‌లను ఈఆర్సీకి సమర్పించాలన్న నిబంధన ఉందని, అది ఉంటేనే తాము ఛార్జీలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దానిని వెంటనే సమర్పించాలని డిస్కంలను ఆదేశించినట్టు ఆయన తెలిపారు.

డిస్కంల రెవెన్యూ 2021, 22 సంవత్సరానికి రూ.29,343 కోట్లు

దీంతోపాటు డిస్కంల రెవెన్యూ 2021, 22 ఆర్థిక సంవత్సరానికి రూ.29,343 కోట్లు, 2022, 23 సంవత్సరానికి రూ.36,474 కోట్లుగా డిస్కంలు సమర్పించిన ఏఆర్‌ఆర్‌లో పేర్కొన్నారని ఆయన తెలిపారు. వీటికి సంబంధించి ప్రభుత్వ సబ్సిడీ 2021, 22 ఆర్థిక సంవత్సరానికి రూ.5,652 కోట్లు, 2022, 23 సంవత్సరానికి రూ.5,652 కోట్లుగా ఉందని చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. వీటితోపాటు డిస్కంల రెవెన్యూ గ్యాప్ 2021, 22 ఆర్థిక సంవత్సరానికి ఎస్‌పిడిసిఎల్ సంస్థది రూ.7,008 కోట్లుగా, 2022, 23 సంవత్సరానికి రూ.7,731 కోట్లుగా ఉందని చైర్మన్ తెలిపారు. దీంతోపాటు ఎన్‌పిడిసిఎల్ సంస్థది రూ.3,616 కోట్లుగా, 2022, 23 సంవత్సరానికి రూ.3,197 కోట్లుగా ఉందని శ్రీరంగారావు తెలిపారు.

ప్రజల అభిప్రాయాలను, సలహాలను స్వీకరిస్తాం

డిస్కంలు టారిఫ్‌లను సమర్పించిన తరువాత చార్జీల పెంపుపై ప్రజల అభిప్రాయాలను, సలహాలను స్వీకరిస్తామని ఇదంతా మార్చి 31వ తేదీ లోగా పూర్తి చేస్తామని, ఏప్రిల్ 01వ తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయని చైర్మన్ వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక పారిశ్రామిక విధానం, ప్రతిష్టాత్మక వ్యవసాయం, బహుళ ప్రయోజన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కారణంగా విద్యుత్ డిమాండ్‌తో సాటు తలసరి విద్యుత్ వినియోగంలో గణనీయమైన పెరుగుదల ఉందని చైర్మన్ తెలిపారు.

డిస్కంలను ఆర్థికంగా బలోపేతం చేయాలి

రాష్ట్రంలో కొన్నేళ్లుగా విద్యుత్ ఛార్జీలను పెంచలేదన్నారు. క్లీన్ ఎనర్జీ సెస్, సరుకు రవాణా వంటి ఇన్‌పుట్ ఖర్చులు బాగా పెరిగినప్పటికీ విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి ప్రధాన వనరు అయిన థర్మల్ పవర్ స్టేషన్ల ఛార్జీలు మొదలైనవి పెరిగాయని చైర్మన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో టారిఫ్ సబ్సిడీలను విడుదల చేస్తున్నప్పటికీ డిస్కంలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయన్నారు. ఎన్ని ఒత్తిడులు ఉన్నా అందరికీ 24 గంటల నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్‌ను డిస్కంలు సరఫరా చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఈనేపథ్యంలో డిస్కంలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News