Wednesday, January 22, 2025

మూడు కొత్త ముఖాలు!

- Advertisement -
- Advertisement -

ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలుచుకొన్న మూడు ప్రధానమైన రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల నియామకంలో భారతీయ జనతా పార్టీ చేసిన జాప్యం అర్థం లేనిది కాదని రుజువవుతున్నది. ఎంతో మథనం చేసి వీలైనంత మంచి వారిని, ప్రజాభిమానాన్ని కోల్పోకుండా కాపాడగలిగే వారిని ఎంపిక చేయడానికి జరిగిన లోతైన కసరత్తే జాప్యానికి కారణమని బోధపడుతున్నది. ఆ క్రమంలో ప్రజలు చూసి చూసి విసుగెత్తిపోయిన పాత ముఖాలను వదిలించుకోడానికి ఆ పార్టీ అగ్రనేతలు మొదట ప్రాధాన్యం ఇచ్చారు.

వాస్తవానికి చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో విజయాన్ని బిజెపి ఊహించి వుండదు. అలాగే రాజస్థాన్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అందించినట్టు భావిస్తూ వచ్చిన మెరుగైన పాలన ఆ పార్టీని రెండోసారి అధికారంలోకి తెస్తుందని కూడా ఊహాగానాలు వెలువడ్డాయి. చత్తీస్‌గఢ్‌లోనూ అదే కారణం మీద అలాగే జరుగుతుందని భావించారు. గత ఎన్నికల తర్వాత మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని అడ్డదారిలో కైవసం చేసుకొన్నందుకు బిజెపికి ఆ రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెబుతారనుకొన్నారు. అవేమీ రుజువు కాలేదు. ముచ్చటగా ఈ మూడు రాష్ట్రాలూ కమలనాథుల ఖాతాలో వచ్చి చేరాయి. లోక్‌సభ ఎన్నికలు ఎంతో దూరం లేవు. వాటిని ఎదుర్కోడానికి తగిన ఆత్మవిశ్వాసాన్ని బిజెపికి ఈ మూడు రాష్ట్రాల విజయాలు ప్రసాదించాయి. అందుచేత ఇక్కడ ప్రజాభిమానాన్ని ఆ ఎన్నికల వరకైనా పదిలంగా కాపాడుకోవాలన్న సంకల్పం దానిలో కలిగింది. ముఖ్యమంత్రుల ఎంపికలో అది స్పష్టపడుతున్నది.

చత్తీస్‌గఢ్ జనాభాలో ఆదివాసీలు 32% వరకు వుంటారు. వారిని దృష్టిలో పెట్టుకొనే ఆ వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయిని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసినట్లు బోధపడుతున్నది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా చేసిన విష్ణుదేవ్ సాయి వయసు 59 సంవత్సరాలు. అజిత్ జోగి తర్వాత చత్తీస్‌గఢ్‌కు ముఖ్యమంత్రి అవుతున్న రెండవ గిరిజనుడు. విష్ణుదేవ్ సాయి కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. నాలుగు సార్లు ఎంపిగా, మూడుసార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. గిరిజన నేపథ్యంతో పాటు విశేష అనుభవం వున్న రాజకీయ నేత కావడం ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పేరు ఈసారి ప్రస్తావనకు రాలేదు.

చత్తీస్‌గఢ్ పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశాలలో కూడా గిరిజనులు విశేషంగా వున్నారు. విష్ణుదేవ్‌ను ఎంచుకోడంలో ఈ అంశం కూడా పని చేసి వుంటుంది. మధ్యప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఎన్నికల సమయంలోనే బిజెపి పక్కన పెట్టింది. 18 ఏళ్ళ పాటు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చౌహాన్ ప్రజల ఆదరణను చూరగొనే రాజకీయాకర్షణ శక్తిని కోల్పోయారని పార్టీ నాయకత్వం భావించినట్టుంది. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసిన మోహన్ యాదవ్ వెనుకబడిన తరగతులకు చెందినవారు. ఈయన పేరును ఎవరూ ఊహించలేదు. మళ్ళీ చౌహాన్‌నే సిఎంను చేస్తారని లేకపోతే కొత్తగా శాసన సభకు ఎన్నికైన ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను ఎంచుకొంటారని చాలా మంది భావించారు. వారికి జై కొడుతూ నినాదాలు కూడా మార్మోగాయి.

ఇంకా నరేంద్ర సింగ్ తోమార్, కైలాస్ విజయ్ వర్గీయా, విడి శర్మ వంటి వారి పేర్లు వినవచ్చాయి. శాసన సభ పక్ష సమావేశంలో తన పేరును ప్రకటించినప్పుడు తానే నమ్మలేకపోయానని మోహన్ యాదవ్ స్వయంగా చెప్పుకొన్నారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తరపున ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్, బీహార్‌లో తేజస్వి యాదవ్ బరిలో వున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యప్రదేశ్‌కు ఈసారి అదే వర్గానికి చెందిన మోహన్ యాదవ్‌ను బిజెపి నాయకత్వం ఎంపిక చేసిందని భావించవచ్చు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ పార్టీకి ఎంతో కొంత మేలు జరుగుతుందనే దృష్టి కూడా ఇందులో కనిపిస్తున్నది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా రాజవంశానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను పక్కన పెట్టడం విశేషమైన పరిణామమే.

భజన్‌లాల్ శర్మ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈయనకు ఆర్‌ఎస్‌ఎస్ ఆశీస్సులున్నాయి. అలాగే బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాకు సన్నిహితుడు. 20 ఏళ్ళుగా పార్టీ సేవలో తలమునకలై వున్నవారు. రాజస్థాన్‌కు వసుంధర రాజే, అశోక్ గెహ్లాట్ పాతికేళ్ళుగా ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రులవుతూ వచ్చారు. భజన్‌లాల్ శర్మ ఎంపికతో దానికి విఘాతం కలిగింది. మొట్టమొదటి సారిగా కొత్త వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం మీద ఆశీనులవుతున్నారు. కష్టించి పని చేసే కార్యకర్తలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కలుగుతుందనే సందేశాన్ని ఇవ్వాలని బిజెపి ఈ కొత్త ముఖాలను ఎంపిక చేసినట్టు భావించాలి. వరుసగా మూడోసారి దేశాధిపత్యం తనను వరించాలని కోరుకొంటున్న బిజెపి ఉమ్మడి ప్రతిపక్షాన్ని ఎదుర్కోడానికి అవసరమైన అస్త్రాలను సమకూర్చుకొంటున్నదని అర్థమవుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News