Sunday, November 17, 2024

సాగు చట్టాలు రైతులపాలిట మరణ శాసనాలు

- Advertisement -
- Advertisement -

New farm laws are 'death warrant' for Farmers:Arvind Kejriwal

 

ఎర్రకోట హింస వెనక కేంద్రం హస్తం
మీరట్ ర్యాలీ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్

మీరట్ : కొత్తసాగు చట్టాలపై ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. రైతుల పాలిట అవి మరణ శాసనాలు అని అభివర్ణించారు. ఆదివారం కేజ్రీవాల్ ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో నిర్వహించిన ‘కిసాన్ మహాపంచాయత్’ సభకు హాజరై ప్రసంగించారు. రైతులకు సాయం చేసే ఉద్దేశం కేంద్రానికి ఎంత మాత్రం లేదన్నారు. రైతుల భూమిని పెత్తందార్లకు కట్టబెట్టాలని కేంద్రం చూస్తోందని ఆక్షేపించారు. కేంద్రం తెచ్చిన కొత్త సాగుచట్టాల వల్ల రైతులు తమ సొంత పొలాల్లోనూ కూలీలుగా మారుతారంటూ పేర్కొన్నారు. ‘కొత్త సాగుచట్టాల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, గతంలో కనీస మద్దతు ధర ఉంది, ఇప్పుడు అది కొనసాగుతుంది, భవిష్యత్తులో కూడా కనీస మద్దతు ధర ఉంటుందని’ మోడీపార్లమెంట్ సాక్షిగా తెలిపారన్నారు. నూతన సాగు చట్టాల రద్దుకోసం మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతుల పోరాటాన్ని నీరు గార్చడానికే ఆయన ఇలాంటి నమ్మబలికే మాటలు మాట్లాడుతున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

ఇదే అంశంలో యూపీలో అధికారంలో ఉన్న యోగి ప్రభుత్వానికి మాత్రం రైతుల అంశాలు పట్టవా అని ప్రశ్నించారు. సొంత రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టదు గాని కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలకు మద్దతిస్తున్నట్లు యోగి ప్రభుత్వం పేర్కొనడం సిగ్గుచేటన్నారు. గత రెండేళ్లుగా మీ రాష్ట్రంలోని చెరకు రైతులకు చెల్లింపు విషయంలో భరోసా ఇవ్వకపోవడంతోనే ఆయన పాలన ఏంటో అర్థమవుతుందన్నారు. రైతులను పట్టించుకోని యోగి ప్రభుత్వానికి ఇది పెద్ద అవమానం అని ఎద్దేవా చేశారు. జనవరి 26న చోటుచేసుకున్న ఎర్రకోట హింసకు కేంద్రాన్ని కేజ్రీవాల్ తప్పుపట్టారు. ఎర్రకోట హింస వెనుక ఉన్నది కేంద్రమే కానీ, రైతులు కారని అన్నారు. అసలు జరిగిందేమిటో ఢిల్లీ ముఖ్యమంత్రిగా తనకు తెలుసునని పేర్కొన్నారు. ‘ఎర్రకోట హింస వెనుక ఉన్నది కేంద్రం, రైతులు కాదు. రైతులకు ఢిల్లీ రోడ్లు కూడా తెలియవు. అలాంటి వాళ్లను కేంద్రం తప్పుదారి పట్టించింది’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆందోళన జరుపుతున్న రైతులు అనేక వేధింపులకు గురవుతున్నారని, బ్రిటీష్ హయాంలో కూడా ఇలాంటివి జరగలేదని తీవ్రంగా మండిపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News