Monday, December 23, 2024

కొత్త ఆర్థిక సంవత్సరంలో వచ్చే మార్పులివే..

- Advertisement -
- Advertisement -

గృహ రుణ వడ్డీ రాయితీ ముగుస్తుంది
ఔషధాలు ప్రియం, హైవేపై ఎక్కువ పన్ను చెల్లించాలి

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) ఏప్రిల్ 1 నుండి ప్రారంభమైంది. ఈ నెల నుంచి పలు నిబంధనలు మారనున్నాయి. ఈ మారిన నిబంధనలు ప్రజల ఆదాయాలు, ఖర్చులు, పెట్టుబడులపై ప్రభావం చూపనున్నాయి. వాటిలో పిఎఫ్, హోమ్ లోన్, క్రిప్టో కరెన్సీ, ఔషధాలు, పాన్‌ఆధార్ లింక్ వంటివి ఉన్నాయి.

ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్)

పిఎఫ్ ఖాతాలో వార్షికంగా రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన ఉద్యోగులు వడ్డీపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను లెక్కింపు కోసం మొత్తం రెండు విధానాలు రూపొందించారు. మొదటిది మినహాయింపు కంట్రిబ్యూషన్, మరొకటి రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ కంట్రిబ్యూషన్, ఇది పన్ను పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పరిమితి రూ.5 లక్షల వరకు ఉంది.

గృహ రుణంపై మినహాయింపు

ఈ నెల నుంచి సరైన గృహ కొనుగోలుదారులకు మినహాయింపు ఉండు. మొదటి సారి ఇంటిని కొనుగోలు చేసినట్లయితే, చెల్లించిన వడ్డీకి సెక్షన్ 80ఇఇఎ కింద 1.5 లక్షల అదనపు మినహాయింపు ప్రయోజనం లభించబోదు. ఇంటి విలువ 45 లక్షల కంటే తక్కువ ఉంటే ఇప్పటి వరకు వడ్డీ చెల్లింపుపై 1.5 లక్షల వరకు తగ్గింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మినహాయింపు సెక్షన్ 24బి కింద లభించే రూ. 2 లక్షల మినహాయింపునకు అదనంగా ఉంటుంది. 2019 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 మధ్య ఇల్లు కొనుగోలు చేయడానికి రుణం తీసుకున్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుంది.

ఔషధాలు ప్రియం

కొత్త ఆర్థిక సంవత్సరం(202223)లో ఆరోగ్య సంరక్షణ కూడా ఖరీదు కానుంది. సుమారు 800 లైఫ్ సేవింగ్ ఔషధాల ధర 10 శాతం పెరుగుతుంది, ఇది చికిత్స ఖర్చును మరింత పెంచనుంది.

పాన్ గడువు

పాన్‌ని ఆధార్‌తో అనుసంధానం చేసే గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. కానీ ఇప్పుడు రెండింటిని అనుసంధానం చేసినప్పటికీ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. 2022 జూన్ 30 వరకు రూ. 500 జరిమానా చెల్లించాలి. ఆ తర్వాత రూ.1000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. 2023 మార్చి 31 తర్వాత కూడా పాన్ నంబర్ లింక్ చేయనట్లయితే, ఆ కార్డు పనిచేయదు.

జిఎస్‌టి

రూ.20 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ కల్గిన వ్యాపారాలు ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా ఇ-ఇన్‌వాయిసింగ్ పరిధిలోకి వస్తాయి. ప్రతి వ్యాపారం లావాదేవీకి ఇ-ఇన్‌వాయిస్ జారీ చేస్తారు. అలా చేయకపోతే రవాణా సమయంలో వస్తువులు జప్తు చేసే అవకాశముంది. అలాగే కొనుగోలుదారు పొందే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా ప్రమాదంలో పడుతుంది.

మ్యూచువల్ ఫండ్స్

మ్యూచువల్ ఫండ్స్ లేదా దేశీయ సంస్థల నుంచి ఆర్జించే డివిడెండ్ ఇకపై పన్ను పరిధిలోకి వస్తాయి. హైయర్ టాక్స్, లోయర్ టాక్స్‌లు పడనున్నాయి. రాష్ట్ర ఉద్యోగులు తమ యజమాని ఎన్‌పిఎస్ సహకారంపై అధిక మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. రెండేళ్ల తర్వాత అప్‌డేట్ చేసిన ఐటి రిటర్న్‌లను ఫైల్ చేయవచ్చు.

హైవే ప్రయాణం ప్రియం
జాతీయ రహదారిపై ప్రయాణం ఇకపై ప్రియం కానుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ)టోల్ ట్యాక్స్‌ను రూ.10 నుంచి రూ.65కి పెంచింది. చిన్న వాహనాలకు రూ.10 నుంచి రూ.15కు, వాణిజ్య వాహనాలకు 65 రూపాయల వరకు పెంచారు.

క్రిప్టోకరెన్సీ

ఏప్రిల్ 1 నుండి వర్చువల్ కరెన్సీపై పన్ను నియమాలు వర్తిస్తాయి. బిట్‌కాయిన్ వంటి వర్చువల్ డిజిటల్ ఆస్తులు లేదా క్రిప్టోపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి క్రిప్టో కరెన్సీని విక్రయించడం ద్వారా లాభం పొందినట్లయితే, సదరు వ్యక్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు జూలై 1 నుంచి క్రిప్టో విక్రయాలపై 1 శాతం టిడిఎస్ కూడా కట్ అవుతుంది.
ఉదాహారణకు కొనుగోలుదారులు క్రిప్టోకరెన్సీని రూ.15 వేలకు కొని, ఆ తర్వాత రూ.25 వేలకు విక్రయిస్తే, రూ.10 వేల లాభం వస్తుంది. దీనిపై 30 శాతం పన్ను అంటే రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బిట్‌కాయిన్‌లో రూ.1000 లాభం వచ్చి, ఇథేరియంలో రూ.700 నష్టం వచ్చినప్పటికీ రూ.వెయ్యి లాభంపై రూ.300 పన్ను చెల్లించాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News