Sunday, December 22, 2024

కరోనా కొత్త వెరియంట్ జెఎన్1 కేసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కరోనా కొత్త వెరియంట్ జెఎన్.-1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కేంద్రానికి తెలిపారు. దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. అందులో భాగంగా బుధవారం కరోనా కొత్త వెరియంట్ జెఎన్.1 మహమ్మారి కట్టడిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మంసుఖ్ మాండవీయ అధ్వర్యంలో అన్ని రాష్ట్రాల వైద్య, అరోగ్య శాఖ మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో అరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్ర సచివాలయం నుండి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వెరియంట్ జెఎన్.1 మహమ్మారి కట్టడిపై తీసుకుంటున్న మందస్తు చర్యలను మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఒక్క రోజే ఆరు కేసులు నమోదు
రాష్ట్రంలో బుధవారం ఒక్క రోజే ఆరు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీహెచ్ రవీంద్రనాయక్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 14 కొవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. బుధవారం మొత్తం 538 మంది కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఇంకా 42 మంది ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు నమోదవుతున్నందున ప్రభుత్వం అప్రమత్తమయింది. వాతావరణంలో మార్పుల కారణంగా జర్వం, జలుబు, గొంతునొప్పి, దగ్గు, వాంతులు, విరేచనాలతో వంటి సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేశారు. ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఛెస్ట్ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్‌లో వైరల్ ఫీవర్స్, దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలతో వచ్చే బాధితుల సంఖ్య పెరిగింది.

ప్రస్తుత పరిస్థితుల్లో దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు సమూహంగా ఉన్న జనంలోకి వెళ్లకపోవడం, మాస్క్ ధరించడం మంచిదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెంచేందుకు సంతులిత ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వం తెలిపిన కొవిడ్ నియమాలను పాటించాలని సూచిస్తున్నారు. కొవిడ్ కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు అన్ని విధాలా సిద్ధమవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News