Wednesday, January 22, 2025

పేపర్ లీక్ కేసులో ట్విస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ (డిఇ) రమేశ్ పేరు ఈ కేసులో తెరపైకి వచ్చింది. విద్యుత్ శాఖ డిఇ రమేశ్ కనుసన్నల్లో ఎఇ పేపర్ పెద్ద ఎత్తున చేతులు మారినట్లు, దాదాపు 20 మందికి ప్రశ్నాపత్రాలు విక్రయించినట్లుగా సిట్ గుర్తించింది. తాజాగా డిఇ రమేశ్ వ్యవహరం తెరపైకి రావటంతో అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే విద్యుత్ శాఖలో డిఇ ఉద్యోగం చేస్తూనే హైదరాబాద్ లో ఓ కోచింగ్ సెంటర్‌లో శిక్షకుడిగా కూడా రమేశ్ పనిచేసేవారని సిట్ దర్యాప్తులో తేలింది.

అక్కడి అభ్యర్థుల పరిచయా లతో లీకేజీ దందా నడిపినట్లు వెల్లడైంది. మరోవైపు సిట్ దర్యాప్తులో సంచనాలు వెలుగులోకి వస్తున్నాయి. అడ్డదారుల్లో పేపర్ సంపాదించిన అభ్యర్థులు పరీక్షలు రాసి టాపర్లుగా నిలిచిన విషయం విచారణలో తేలింది. ఎఇ పరీక్షలో టాపర్‌గా నిలిచిన అభ్యర్థి చిన్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోవడం వెలుగు చూసింది. ఎఇలో టాప్ ర్యాంక్ సాధించిన అభ్యర్థి (ఎ+బి) స్క్వేర్ అంటే కూడా చెప్పలేక దిక్కులు చూశాడని సిట్ అధికారులు అంటున్నారు. కనీస పరిజ్ఞానం లేకపోయినా పోటీ పరీక్షల్లో నెగ్గారన్నారు. వీరంతా అడ్డదారిలో ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసి టాపర్లుగా నిలిచారని సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో టాపర్ల అసలు రహస్యం వెలుగుచూసింది.

గ్రూప్1, ఎఇ, ఎఇఇ, డిఎవొ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన వారిని సిట్ పోలీసులు విచారణ చేశారు. వారి నుంచి వచ్చే జవాబుల ఆధారంగా ప్రశ్నపత్రాలు కొను గోలు చేసి పరీక్ష రాశారని గుర్తిస్తున్నారు. పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన అభ్యర్థులు చిన్న ప్రశ్నలకే తెల్లమొహం వేశారంటూ సిట్ పోలీసులు అంటున్నారు. కాగా, టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇప్పటివరకు 43 మందిని సిట్ అరెస్ట్ చేసింది. అరెస్ట్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు పులిదిండి ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి ద్వారా అనేక ప్రశ్న పత్రాలు ఒకప్పుడు కమిషన్‌లో పనిచేసిన వీరి స్నేహితుడు సురేశ్‌కు చేరాయి.

ఇతడు వీటిలో అసిస్టెంట్ ఇంజినీర్(ఎఇ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డిఎఒ) పేపర్లను తన అపార్ట్‌మెంట్‌లో నివసించే వారికి మధ్యవర్తి ద్వారా విక్రయించాడు. ఈ వ్యవహారంలో నల్గొండ జిల్లా నకిరేకల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పూల రవికిశోర్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. సురేశ్ గతంలోనే అరెస్టవ్వగా, రవికిశోర్‌తో పాటు ఎఇ, డిఎఒ పేపర్లు ఖరీదు చేసిన అన్నాచెల్లెళ్లు రాయపురం విక్రమ్, దివ్యలను బుధవారం అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News