Sunday, November 17, 2024

పురుషులలో సంతానోత్పత్తికి కొత్త జన్యు కారకాలు

- Advertisement -
- Advertisement -

New genetic determinants of male fertility

n మొత్తం ఎనిమిది జన్యువులను గుర్తించిన
డాక్టర్ తంగరాజ్ నేతృత్వంలోని పరిశోధన బృందం
n సెంట్రిన్ 1 ఉత్పరివర్తనం వలన కణ విభజన వైఫల్యం,
n తద్వారా శుక్రకణాల ఉత్పత్తిలో లోపాలు
తలెత్తుతాయని పరిశోధనలో వెల్లడి
n సంతానలేమికి కేవలం మహిళలు కారణమవుతారని భావించకూడదు : డాక్టర్ తంగరాజ్

మన తెలంగాణ/హైదరాబాద్ : నేటితరంలో సంతానలేమి సమస్య పెరుగుతోంది. అయితే సంతానలేమి సమస్య ఉన్న సగం మంది దంపతులలో పురుషుల సంతానోత్పత్తి సమస్యలే కారణమవుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. సంతానలేమి సమస్య ఉన్న చాలా మంది పురుషులలో వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన జన్యులోపాలతో పాటు ఇతర కారణంగా ఉంటాయని తేలింది. గత రెండు దశాబ్దాలుగా పురుషుల సంతానలేమికి సంబంధించిన జన్యుపరమైన కారణాలను అన్వేషిస్తూ డాక్టర్ కె.తంగరాజ్ బృందం పరిశోధనలు చేస్తోంది. సంతానలేమి సమస్య ఉన్న 38 శాతం పురుషులలో వై క్రోమోజోమోల అసాధారణతలు, ఆటోసోమల్, మైటోకాండ్రియాల్ జన్యువులలో ఉత్పరివర్తనలు (మ్యుటేషన్) కారణమవుతాయని గతంలో ఈ బృందం చేసిన అధ్యయనాలలో వెల్లడైంది. అయినప్పటికీ, భారతదేశంలోని పురుషులలో సంతానలేమికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల డాక్టర్ కె.తంగరాజ్ నేతృత్వంలో పలు ఇతర పరిశోధనా కేంద్రాలు కలిసి జరిపిన కొత్త అధ్యయనంలో భారతీయ పురుషులలో సంతానోత్పత్తికి అవసరమైన 8 జన్యువులను గుర్తించారు.

ఈ అధ్యయనం ఇటీవల అంతర్జాతీయ జర్నల్ హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్‌లో ప్రచురించబడింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రధాన పరిశోధకులు, సిసిఎంబి పూర్వ విద్యార్థి, ప్రస్తుతం ముంబైలోని ఐసిఎంఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్ హెల్త్ (ఎన్‌ఐఆర్‌ఆర్‌సిహెచ్)లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ దిగుమర్తి మాట్లాడుతూ ..తాము తొలుత ఎంపిక చేసిన 47 మంది సంతానలేమి సమస్య ఉన్న పురుషులలో వారి మొత్తం జన్యువులను (సుమారు 30 వేల జన్యువులు) నెక్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనే సాంకేతిత పద్ధతి ద్వారా పరిశీలించి, సంతానలేమికి కారణమైన జన్యులోపాలను కనుగొన్నామని తెలిపారు. ఈ జన్యులోపాలను భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,500 మంది సంతానలేమి సమస్య ఉన్న పురుషులలో పరిశీలించి, నిర్ధారించామని పేర్కొన్నారు.

డిబిటి సెంటర్ ఫర్ డిఎన్‌ఎ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నస్టిక్స్ డైరెక్టర్, ఈ అధ్యయనం సీనియర్ పరిశోధకుడు,డాక్టర్ తంగరాజ్ మాట్లాడుతూ , పురుషులలో సంతానోత్పత్తికి అవసరమైన మొత్తం ఎనిమిది జన్యువులను (డిఆర్‌డిటి, సిఇటిఎన్1, సిఎటిఎస్‌పిఇఆర్‌డి, జిఎంసిఎల్1, ఎస్‌పిఎటిఎ6 టిఎస్‌ఎస్‌కె4, జెడ్‌ఎన్‌ఎఫ్318) తమ పరిశోధనలో గుర్తించామని తెలిపారు. సంతానోత్పత్తిలో ఈ జన్యువుల పాత్ర గురించి ఇంతకు ముందు తెలియదని చెప్పారు. ఈ జన్యువులు శుక్రకణాల ఉత్పత్తని దెబ్బతీసి తద్వారా పురుషులలో సంతానలేమికి కారణమయ్యే ఉత్పరివర్తనలను తమ బృందం గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎనిమిది జన్యువులలో ఒకటైన సెంట్రిన్ 1లో ఉత్పరివర్తనం వలన కణాలలో జరిగే పరిణామాలను బృందం గుర్తించిందని వివరించారు. సెంట్రిన్ 1 ఉత్పరివర్తనం వలన కణ విభజన వైఫల్యం, తద్వారా శుక్రకణాల ఉత్పత్తిలో లోపాలు తలెత్తుతాయని ఈ పరిశోధనలో వెల్లడైందని అన్నారు.

సంతానలేమి సమస్య ఉన్న చాలా మంది పురుషులలో వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన జన్యులోపాలతో పాటు ఇతర కారణంగా ఉంటాయని తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. సంతానలేమికి కేవలం మహిళల్లో
ఉన్న సంతానోత్పత్తి లోపాలు మాత్రమే కారణమవుతాయని భావించడం తప్పని డాక్టర్ తంగరాజ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ వినయ్ కుమార్ నందికూరి మాట్లాడుతూ, ఈ అధ్యయనంలో వెల్లడైన జన్యుపరమైన కారణాలు సంతానలేమి రోగనిర్ధారణలో, పురుషులలో సంతానోత్పత్తికి మెరుగైన నిర్వహణ పద్ధతులు అభివృద్ధి చేయడంలో దోహదపడతాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News