Monday, December 23, 2024

నూతన గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు కరువు

- Advertisement -
- Advertisement -

నాంపల్లి: ఉమ్మడి ఆంధ్రపదేశ్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల పాలనావ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాలుగున్నర సంవత్సరాల క్రితం గిరిజన తండాలు , కుగ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుంది. నూతన గ్రామ పంచాయతీలకు పాత గ్రామ పంచాయతీలతో పాటు పాలక వర్గం ఎన్నికలు నిర్వహించి నూతన గ్రామ పంచాయతీలలో ఆర్బాటంగా అద్దె గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవాలు నిర్వహించింది. కొత్త గ్రామ పంచాయతీలకు పాలక వర్గాలు ఏర్పాటుకావడం, పంచాయతి కార్యదర్శి పదవులు కట్టబెట్టి పరిపాలన సాగించమని ఆదేశాలు ఇచ్చారు.

నూతన గ్రామ పంచాయతీలకు ఎలాంటి గ్రామ కంఠభూములు లేవు. భూముల రేట్లు ఆకాశాన్ని తాకుతుండటంతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు ,ఇతర భవనాల నిర్మాణం కోసం దాతలు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రతి గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరిగిన తరువాత భూములు ఇచ్చిన దాతలకు నామినేటెడ్ పోస్టు సృష్టించారు. దాతలు భూమి ఇచ్చిందిలేదు, పోస్టువల్ల వారికి ఒరిగింది ఏమి లేదు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో 12 నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. వాటికి ఎన్నికలు జరిగి సర్పంచులు,ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ,కోఆప్షన్ మెంబర్లు కొలువుదీరారు. గ్రామ పంచాయతీల పాలక వర్గం పదవీ కాలం 6మాసాలలో పూర్తి అవుతుంది.

కొత్త గ్రామ పంచాయతీల పాలక వర్గాలు కనీసం సొంత భవనాలు కూడా నిర్మించుకోలేని దుస్థితిలో ఉన్నాయి.మండలంలోని గానుగుపల్లి, జాన్‌తండా,నెవిళ్లగూడెం, తుంగపాడు, తిరుమలగిరి, కేతేపల్లి, చల్లవానికుంట, నామానాయక్ తండా, రేఖ్యాతండా, రాజ్యాతండా, సుంకిశాల ,ఫకీర్‌పురం, నూతన గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవు, సొంత భవనాల నిర్మాణం కోసం స్థల కేటాయింపులు, నిధుల కేటాయింపులు లేకపోవడంతో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు.

మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించిన అనంతరం మండలంలోని 5 గ్రామ పంచాయతీలకు ఒక్కో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ కింద 20లక్షల రూపాయల చొప్పున అనుమతులు ఇప్పించి,జనవరి మాసంలో నూతన గ్రామపంచాయతి బిల్డింగ్‌ల నిర్మాణానికి శిలాఫలకాలు వేశారు. మండంలోని కేతపల్లి నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి పునాదులు మాత్రమే వేశారు. మంజూరైన మిగతా గ్రామ పంచాయతీలకు నేటికీ పనుల దాఖలాలు లేవు.

రాజ్యాతండాలో గిరిజన అభివృద్ధ్ది సంస్థ ద్వారా గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు మంజూరుకాగా, ఇంజనీరింగ్ సిబ్బంది కొరత కారణంగా అట్టి పనులను సైతం పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బందికి అప్పగించారు. నిధులు మంజూరైనా పనులు చేపట్టడంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందో అంతపట్టని సమస్యగా మారింది.ఎన్‌ఆర్‌ఈజిఎస్ నిధులు సకాలంలో విడుదల కావని పనులు చేసి బిల్లులకోసం వేచి ఉండటం ,చిన్న గ్రామ పంచాయతీలకు చిక్కు సమస్యగా మారింది, తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం ఎంతో హట్టహాసంగా పరిపాలనా సౌలభ్యం కోసం నూతన గ్రామపంచాయతీలను చేయడం ఆనందదాయకమే అయినా కనీసం పాలకవర్గాల పదవీకాలం పూర్తి అయ్యేలోగా సొంత భవనాలు నిర్మిస్తే నూతన గ్రామ పంచాయతీలు సంతోషపడే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News